ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు అరుదైన రికార్డ్లకి చేరువలో ఉన్నాడు. అడిలైడ్ వేదికగా రేపు ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఆడనున్న కోహ్లీకి.. ఆ స్టేడియంలో మెరుగైన రికార్డ్‌లు ఉన్నాయి. అడిలైడ్ స్టేడియంలో ఇప్పటికే మూడు టెస్టు సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ 71.83 సగటుతో ఏకంగా 431 పరుగులు చేశాడు. అడిలైడ్ మైదానంలో అత్యధిక పరుగులు సాధించిన నాన్ ఆస్ట్రేలియన్‌గా ఘనత సాధించడానికి 180 పరుగుల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఆ రికార్డు వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ లారా పేరిట ఉంది. లారా 4 మ్యాచ్‌ల్లో 610 పరుగులు చేయగా, విరాట్ మూడు మ్యాచ్‌ల్లో 431 పరుగులు చేశాడు.
కంగారూల గడ్డపై అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాట్స్‌మన్‌గా దిగ్గజ క్రికెటర్ సచిన్ సాధించిన రికార్డును అధిగమించడానికి కోహ్లీ మరో అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో 20 టెస్టులు ఆడిన సచిన్ ఆరు శతకాలు సాధించాడు. కోహ్లీ 12 టెస్టుల్లోనే సచిన్‌తో సమంగా నిలిచాడు. ఈ రెండు రికార్డులను అడిలైడ్ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులోనే సాధిస్తాడని అతడి ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాలు సాధించిన జాబితాలో కోహ్లీ (70) మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ (100), రికీ పాంటింగ్ (71) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మరో శతకం సాధిస్తే ఈ లిస్ట్ లో పాంటింగ్‌తో కలిసి సమంగా రెండో స్థానంలో నిలుస్తాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు ఉదయం 9.30 గంటల నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే పితృత్వ సెలవులు తీసుకుని భారత్‌కి కోహ్లీ వచ్చేయనుండగా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఏ ఫార్మాట్లోనూ కోహ్లీ సెంచరీ నమోదు చేయలేదు.
Published by:Sridhar Reddy
First published:December 16, 2020, 14:19 IST