భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెలరేగడంతో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయడం విశేషం. సీనియర్ బౌలర్లు లేకపోయినా ఆ భారాన్ని తన భుజాలపై మోసిన సిరాజ్.. టెస్ట్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. శార్దూల్ కూడా 4 వికెట్లతో రాణించాడు. అయితే, మన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కెరీర్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన అతడి ప్రతిభను క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు.ఈ ఇన్నింగ్స్‌లో సిరాజ్ కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. మొత్తంగా 73 పరుగులు ఇచ్చిన హైదరాబాదీ, ఓపెనర్ డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్‌స్మిత్‌లను పెవిలియన్‌కు చేర్చాడు.
వీరితో పాటు హాజల్‌వుడ్, స్టార్క్‌ను అవుట్ చేసి మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సహచర ఆటగాళ్ల నుంచి సిరాజ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, ప్రశంసిస్తున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ‘‘తొలిసారి ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్‌కు స్టాండింగ్ ఓవియేషన్’’ అంటూ ట్వీట్ చేసింది. అయితే, సిరాజ్ ఆసీస్ టూర్లో ఉన్న సమయంలోనే అతడి తండ్రి మొహమ్మద్ గౌస్ మరణించిన సంగతి తెలిసిందే.
బీసీసీఐ అతడికి స్వదేశానికి వెళ్లే అవకాశం కల్పించినప్పటికీ సంప్రదాయ క్రికెట్ ఆడాలన్న తన తండ్రి కలను నెరవర్చేందుకు అతడు అక్కడే ఉండిపోయాడు. ఇక టీమిండియా స్టార్ బౌలర్లు ఇషాంత్ శర్మ మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గైర్హాజరీ నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న ఈ యువ పేసర్ మెరుగ్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. సిడ్నీ టెస్ట్ లో వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఎదురైనప్పటికీ.. ఆత్మవిశ్వాసం చెదరకుండా అద్బుతంగా రాణిస్తున్నాడు.
Published by:Sridhar Reddy
First published:January 18, 2021, 16:28 IST