IND vs AUS 4th Test : అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితంగా తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత్ (India) బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy 2023) సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. ఓవర్ నైట్ స్కోరు 3/0తో చివరి రోజైన ఐదో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. తమ రెండో ఇన్నింగ్స్ ను 78.1 ఓవర్లలో 2 వికెట్లకు 175 పరుగులు చేసింది. మ్యాచ్ ఫలితం వచ్చేది అనుమానంగా ఉండటంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. ఆస్ట్రలియా బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ (163 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మార్నస్ లబుషేన్ (213 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) సిరీస్ లో తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు.
చేజారిన శతకం
నాలుగో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ ఉస్మాన్ ఖవాజా గాయపడ్డాడు. దాంతో అతడు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు. దాంతో ట్రావిస్ హెడ్ తో కలిసి కునెమన్ (6) బ్యాటింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఐదో రోజు ఆటలో కునెమన్ అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అనంతరం లబుషేన్ తో కలిసి ట్రావిస్ హెడ్ జట్టును మందుకు నడిపాడు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడటంతో భారత్ కు వికెట్లు దక్కలేదు. అయితే శతకానికి చేరువగా వచ్చిన హెడ్ ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 139 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం స్టీవ్ స్మిత్ తో కలిసి లబుషేన్ ఆసీస్ ఇన్నింగ్స్ ను కొనసాగించాడు .అయితే మ్యాచ్ ఫలితం తేలడం కష్టమనే నిర్ణయానికి వచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు
అంగీకరించారు.
డ్రా అయినా ఫైనల్స్ కు భారత్
వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో భారత్ ఫైనల్ కు చేరాలంటే నాలుగో టెస్టులో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఒకవేళ ఓడినా.. డ్రా చేసుకున్నా అప్పుడు శ్రీలంక, కివీస్ టెస్టు సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. సోమవారమే ముగిసిన కివీస్, శ్రీలంక తొలి టెస్టులో కేన్ విలియమ్సన్ వీరోచిత సెంచరీ (121 నాటౌట్)తో న్యూజిలాండ్ ను గెలిపించాడు. దాంతో కివీస్ రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి టెస్టులో శ్రీలంక గెలిచినా సిరీస్ సమం అవుతుంది. శ్రీలంక వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరాలంటే కివీస్ పై టెస్టు సిరీస్ నెగ్గాల్సి ఉంది. అయితే తొలి టెస్టు ఓడటంతో శ్రీలంక ఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. దాంతో ఆసీస్ తో నాలుగో టెస్టును డ్రాగా ముగించినా భారత్ ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ ఏడాది జూన్ 7న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs AUS, India vs australia, Rohit sharma, Shubman Gill, Steve smith, Virat kohli