IND vs AUS 4th Test : అహ్మదాబాద్ (Ahmedabad) టెస్టులో విరాట్ కోహ్లీ (Virat Kohli) సూపర్ బ్యాటింగ్ తో రెచ్చిపోతున్నాడు. మూడో రోజు రెండో సెషన్ లో బ్యాటింగ్ కు వచ్చిన అతడు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. గత కొంత కాలంగా టెస్టుల్లో పెద్దగా పరుగులు చేయని కోహ్లీ ఈ మ్యాచ్ తో దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం సెంచరీకి చేరువయ్యాడు. నాలుగో రోజు లంచ్ విరామానికి కోహ్లీ 217 బంతుల్లో 88 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో 12 పరుగులు చేస్తే చాలు కోహ్లీ తన టెస్టు కెరీర్ లో 28వ సెంచరీని అందుకుంటాడు. నాలుగో రోజు లంచ్ విరామానికి భారత్ 131 ఓవర్లలో 4 వికెట్లకు 362 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 118 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం కోహ్లీతో పాటు శ్రీకర్ భరత్ (25 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు.
ఓవర్ నైట్ స్కోరు 289/3తో నాలుగో రోజు బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మర్ఫీ బౌలింగ్ లో రవీంద్ర జడేజా (28) ఖవాజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. అయితే వికెట్ తీసిన ఆనందం ఆసీస్ కు ఎంతో సేపు నిలవలేదు. క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్ వచ్చీ రావడంతోనే ఫోర్, సిక్సర్ తో ఆస్ట్రేలియా బౌలింగ్ ను లయ తప్పేలా చేశాడు. మరో ఎండ్ లో కోహ్లీ కూడా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా భారత్ మరో వికెట్ పడకుండా నాలుగో రోజు తొలి సెషన్ ను పూర్తి చేసింది.
మూడో రోజు ఆటలో శుబ్ మన్ గిల్ సెంచరీ (235 బంతుల్లో 128; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ (35), చతేశ్వర్ పుజారా (42) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో 167.2 ఓవర్లలో 480 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లతో మెరిశాడు. ఓవర్ నైట్ స్కోరు 255/4తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాకు గ్రీన్, ఖవాజాలు భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఓవర్ నైట్ బ్యాటర్ కెమరూన్ గ్రీన్ (170 బంతుల్లో 114; 18 ఫోర్లు) శతకంతో మెరిశాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (422 బంతుల్లో 180 ; 21 ఫోర్లు) కదం తొక్కారు.
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ శ్రీకర్ భరత్, జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, ఉమేశ్ యాదవ్, షమీ
ఆస్ట్రేలియా
ట్రావిస్ హెడ్, ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), గ్రీన్, హ్యాండ్స్ కాంబ్, అలెక్స్ క్యారీ, స్టార్క్, మర్ఫీ, కొనెమన్, నాథన్ లయన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs AUS, India vs australia, Ravindra Jadeja, Team India, Virat kohli