IND vs AUS 4th Test : విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాక్.. అవును గత కొంత కాలంగా టెస్టు ఫార్మాట్ లో పరుగులు సాధించడంలో విఫలం అవుతోన్న కోహ్లీ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో అర్ధ సెంచరీతో మెరిశాడు. శుబ్ మన్ గిల్ సెంచరీ (235 బంతుల్లో 128; 12 ఫోర్లు, 1 సిక్స్)కి కోహ్లీ అర్ధ సెంచరీ (128 బంతుల్లో 59 బ్యాటింగ్; 5 ఫోర్లు) తోడవ్వడంతో.. ఆస్ట్రేలియాకు భారత్ ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 99 ఓవర్లలో 289 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా (54 బంతుల్లో 16 బ్యాటింగ్; 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు. భారత్ మరో 191 పరుగులు వెనుకబడి ఉంది. మరో రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఓవర్ నైట్ స్కోరు 36/0తో బ్యాటింగ్ కు దిగిన భారత్ ను రోహిత్ శర్మ (35), గిల్ లు ముందుకు నడిపించారు. వీరిద్దరూ వేగంగా పరుగులు సాధిస్తూ ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని తగ్గిస్తూ వచ్చారు. అయితే కునెమన్ బౌలింగ్ లో డ్రైవ్ ఆడబోయిన రోహిత్ శర్మ లబుషేన్ కు క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. దాంతో 74 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం పుజారాతో కలిసి గిల్ జట్టును ముందుకు నడిపించాడు. బంతి టర్న్ అవుతుండటంతో వేగంగా పరుగులు సాధించలేకపోయారు. ఈ క్రమంలో గిల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
లంచ్ అనంతరం శుబ్ మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే పుజారా (42) అవుటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ మంచి ప్రదర్శన కనబరిచాడు. టెస్టు ఫార్మాట్ లో కోహ్లీని కొనసాగించడం అనవసరం అంటూ గత కొద్ది రోజులుగా వస్తోన్న విమర్శలకు బ్యాట్ తోనే బదులు చెప్పాడు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే శుబ్ మన్ గిల్ లయన్ బౌలింగ్ లో ఎల్బీగా అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి మరో వికెట్ పడకుండా కోహ్లీ రోజును ముగించాడు.
అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో 167.2 ఓవర్లలో 480 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లతో మెరిశాడు. ఓవర్ నైట్ స్కోరు 255/4తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాకు గ్రీన్, ఖవాజాలు భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఓవర్ నైట్ బ్యాటర్ కెమరూన్ గ్రీన్ (170 బంతుల్లో 114; 18 ఫోర్లు) శతకంతో మెరిశాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (422 బంతుల్లో 180 ; 21 ఫోర్లు) కదం తొక్కారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheteswar Pujara, IND vs AUS, India vs australia, Ravindra Jadeja, Shubman Gill, Steve smith, Virat kohli