IND vs AUS 4th Test : అహ్మదాబాద్ వేదికగా జరగుతున్న నాలుగో టెస్టు.. మిగిలిన మూడు టెస్టులకు భిన్నంగా సాగుతోంది. మొదటి మూడు టెస్టుల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు తొలి రోజే కుప్పకూలింది. అయితే నాలుగో టెస్టులో మాత్రం తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు పరుగుల వరద పారిస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 255/4తో శుక్రవారం రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో రోజు టీ విరామ సమయానికి 146 ఓవర్లలో 7 వికెట్లకు 409 పరుగులు చేసింది. ఓవర్ నైట్ బ్యాటర్ కెమరూన్ గ్రీన్ (170 బంతుల్లో 114; 18 ఫోర్లు) శతకంతో మెరిశాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (421 బంతుల్లో 180 బ్యాటింగ్; 21 ఫోర్లు) డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం ఖవాజాతో పాటు నాథన్ లయన్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు దక్కించుకోగా.. షమీ 2.. జడేజా ఒక వికెట్ సొంతం చేసుకున్నారు.
ఓవర్ నైట్ స్కోరు 255/4తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాకు గ్రీన్, ఖవాజాలు భారీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ తొలి సెషన్ మొత్తం ఆడారు. దాంతో తొలి సెషన్ లో భారత్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. లంచ్ అనంతరం ఫోర్ బాదిన గ్రీన్ టెస్టు కెరీర్ లో తొలి శతకాన్ని అందుకున్నాడు. అనంతరం వేగంగా కూడా ఆడాడు. అయితే బౌలింగ్ కు వచ్చిన అశ్విన్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఒకే ఓవర్లో గ్రీన్ తో పాటు అలెక్స్ క్యారీ (0)లను అవుట్ చేశాడు. కాసేపటికే స్టార్క్ (6)ను కూడా పెవిలియన్ కు పంపాడు. దాంతో ఆస్ట్రేలియా వెంట వెంటనే మూడు వికెట్లను కోల్పోయింది. అయితే నాథన్ లయన్ తో కలిసి మరో ఎండ్ లో ఓపికగా ఆడుతున్న ఖవాజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (38), ట్రావిస్ హెడ్ (32) ఫర్వాలేదనిపించారు.
75 ఏళ్ల బంధం
ఈ ఏడాది భారత్, ఆస్ట్రేలియా బంధానికి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. దీనికి గుర్తుగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా ఉన్న శ్రీ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ కు ప్రత్యేక అతిథులుగా ప్రధాన ప్రధాని మోదీ , ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ హాజరయ్యారు. టాస్ కు ముందు ఇరు దేశాల కెప్టెన్లకు క్యాప్ లను ఇరు ప్రధానులు అందజేశారు. అనంతరం ఇరు ప్రధానులు ల్యాప్ ఆఫ్ ఆనర్ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో వీరిద్దరూ గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం తమ ప్లేయర్లను ఇరు దేశ కెప్టెన్లు ప్రధానులకు పరిచయం చేశారు.
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ శ్రీకర్ భరత్, జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, ఉమేశ్ యాదవ్, షమీ
ఆస్ట్రేలియా
ట్రావిస్ హెడ్, ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), గ్రీన్, హ్యాండ్స్ కాంబ్, అలెక్స్ క్యారీ, స్టార్క్, మర్ఫీ, కొనెమన్, నాథన్ లయన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs AUS, India vs australia, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rohit sharma, Team India