IND vs AUS 3rd Test : భారత (India) పర్యటనలో ఆస్ట్రేలియా (Australia) ఎట్టకేలకు బోణీ కొట్టింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy 2023)లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో దారుణంగా ఓడిన ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో మాత్రం అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి మూడో టెస్టులో విజయం సాధించింది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ పై 9 వికెట్ల తేడాతో నెగ్గింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 78 పరుగులు చేసి నెగ్గింది. ట్రావిస్ హెడ్ (53 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మార్నస్ లబుషేన్ (58 బంతుల్లో 28 నాటౌట్; 6 ఫోర్లు) హెడ్ కు చక్కటి సహకరాం అందించాడు. వీరిద్దరూ అజేయమైన రెండో వికెట్ కు 77 పరుగులు జోడించి ఆస్ట్రేలియాను గెలిపించారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు అర్హత సాధించింది. అంతేకాకుండా సిరీస్ ను సమం చేసే అవకాశాన్ని సజీవంగా ఉంచుకుంది.
స్వల్ప లక్ష్యమే అయినా భారత్ పిచ్ లపై 76 పరుగులు కూడా కొండంతగా కనిపిస్తాయి. అంతేకాకుండా భారత బౌలింగ్ లో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ లు ఉండటంతో టీమిండియా గెలుపుపై అభిమానుల్లో ఏదో ఒక మూల ఆశ ఉంది. అందుకు తగ్గట్టే రోజును భారత్ అద్భుతంగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే అశ్విన్.. ఇన్ ఫామ్ బ్యాటర్ ఖవాజా (0)ను అవుట్ చేశాడు. దాంతో భారత అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఆస్ట్రేలియాను తిప్పేస్తారని భావించారు. అయితే మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ లు అద్భుత ఆటను ఆడారు. వీరు మొదట నెమ్మదిగా ఆడి కుదురుకునే ప్రయత్నం చేశారు. అనంతరం ట్రావిస్ హెడ్ అశ్విన్ బౌలింగ్ లో ఎదురుదాడికి దిగాడు. దాంతో చూస్తుండగానే లక్ష్యం చిన్నదిగా మారిపోయింది. ఫోర్ కొట్టి లబుషేన్ మ్యాచ్ ను ముగించేశాడు. ఈ విజయంతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది. మూడో టెస్టు ఈ నెల 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
రెండో రోజు ఆటలో టీమిండియా అత్యంత ఘోరంగా ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకి ఆలౌట్ అయిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే పెవిలియన్ దారి పట్టింది. చతేశ్వర్ పుజారా (142 బంతుల్లో 59; 5 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheteswar Pujara, IND vs AUS, India vs australia, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rohit sharma, Steve smith