IND vs AUS 2nd Test : బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy 2023)ని టీమిండియా (Team India) నిలబెట్టుకుంది. గత రెండు పర్యాయాలు భారత్ గెలవడంతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ భారత్ దగ్గరే ఉంది. ఇక ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 26.4 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి ఛేదించేసింది. చతేశ్వర్ పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) తన 100వ టెస్టులో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. ఇక గత రెండు ఇన్నింగ్స్ ల్లోనూ విఫలం అయిన తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ రెండో ఇన్నింగ్స్ లో సత్తా చాటాడు. 22 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉండటం విశేషం. నాథన్ లయన్ 2 వికెట్లు తీశాడు. మర్ఫీకి ఒక వికెట్ లభించింది.
లక్ష్యం చిన్నదే అయినా పిచ్ టర్న్ అవుతుండటంతో భారత అభిమానుల్లో ఏదో ఒక మూల చిన్నపాటి భయం ఉండే ఉంటుంది. దానికి తగ్గట్లే ఫామ్ లో లేని రాహుల్ (1) త్వరగా అవుటయ్యాడు. ఆ తర్వాత పుజారా, రోహిత్ శర్మ (31) ఆడటంతో మరో వికెట్ పడకుండా భారత్ లంచ్ కు వెళ్లింది. లంచ్ అనంతరం సమన్వయ లోపంతో రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ (20), పుజారాలు జట్టును ముందుకు నడిపారు. అయితే కోహ్లీ స్టంపౌట్ అవ్వడం.. ఆ తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అవుటయ్యాడు. అయితే శ్రీకర్ భరత్ తో కలిసి పుజారా మ్యాచ్ ను ముగించేశాడు.
ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టానికి 61తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ ను రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తిప్పేశాడు. 7 వికెట్లతో ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ కేవలం 31.1 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 115 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (46 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మార్నస్ లబుషేన్ (50 బంతుల్లో 35; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. వీరు తప్ప మిగిలిన బ్యాటర్స్ సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. రవిచంద్రన్ అశ్విన్ కు మూడు వికెట్లు లభించాయి.
మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాను తొలి ఓవర్లోనే అశ్విన్ దెబ్బ తీశాడు. ఒక అద్భుత బంతికి దూకుడు మీద ఉన్న ట్రావిస్ హెడ్ ను అవుట్ చేశాడు. అనంతరం స్మిత్ (9)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరో ఎండ్ లో బాగా ఆడుతున్న మార్నస్ లబుషేన్ ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక ఇక్కడి నుంచి ఆసీస్ పెవిలియన్ కు క్యూ కట్టింది. రివర్స్ స్వీప్ లు.. స్వీప్ లకు వెళ్తూ చేజేతులా వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో 61/1తో ఉన్న ఆసీస్.. తన చివరి 9 వికెట్లను 52 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, Cheteswar Pujara, IND vs AUS, India vs australia, Ravichandran Ashwin, Ravindra Jadeja