IND vs AUS 2nd Test : రెండో రోజు ఆటను దూకుడుగా ముగించిన ఆస్ట్రేలియా (Australia).. మూడో రోజు మాత్రం చేతులెత్తేసింది. ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టానికి 61తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ ను రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తిప్పేశాడు. 7 వికెట్లతో ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ కేవలం 31.1 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 115 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (46 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మార్నస్ లబుషేన్ (50 బంతుల్లో 35; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. వీరు తప్ప మిగిలిన బ్యాటర్స్ సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. రవిచంద్రన్ అశ్విన్ కు మూడు వికెట్లు లభించాయి.
మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాను తొలి ఓవర్లోనే అశ్విన్ దెబ్బ తీశాడు. ఒక అద్భుత బంతికి దూకుడు మీద ఉన్న ట్రావిస్ హెడ్ ను అవుట్ చేశాడు. అనంతరం స్మిత్ (9)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరో ఎండ్ లో బాగా ఆడుతున్న మార్నస్ లబుషేన్ ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక ఇక్కడి నుంచి ఆసీస్ పెవిలియన్ కు క్యూ కట్టింది. రివర్స్ స్వీప్ లు.. స్వీప్ లకు వెళ్తూ చేజేతులా వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో 61/1తో ఉన్న ఆసీస్.. తన చివరి 9 వికెట్లను 52 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.
భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 83.3 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకంతో రాణించాడు. రవిచంద్రన్ అశ్విన్ (71 బంతుల్లో 37; 5 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. విరాట్ కోహ్లీ (44), కెప్టెన్ రోహిత్ శర్మ (32) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 5 వికెట్లు తీశాడు. మర్ఫీ, మ్యాథ్యూ కునెమన్ లకు చెరో రెండు వికెట్లు లభించాయి. మరొక వికెట్ ను ప్యాట్ కమిన్స్ తీశాడు. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆసీస్ కు ఒక్క పరుగు ఆధిక్యం లభించింది.
కాపాడిన అక్షర్, అశ్విన్
ఈ దశలో కోహ్లీ, జడేజా భారత్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించారు. 5వ వికెట్ కు 59 పరుగులు జోడించారు. అయితే లంచ్ అనంతరం జడేజాను మర్ఫీ అవుట్ చేశాడు. కాసేపటికే కోహ్లీ కూడా అవుటయ్యాడు. తనకు దక్కిన గొప్ప అవకాశాన్ని తెలుగు క్రికెటర్ భరత్ నేలపాలు చేసుకున్నాడు. లేని షాట్ కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యాడు. దాంతో భారత్ 139 పరుగుల వద్ద 7వ వికెట్ ను కోల్పోయింది. అయితే ఈ దశలో జత కలిసిన అక్షర్ పటేల్, అశ్విన్ లు మరో వికెట్ పడకుండా టీ విరామానికి వెళ్లారు. టీ విరామం అనంతరం అక్షర్ పటేల్ వేగంగా పరుగులు సాధించాడు. బౌండరీలు బాదాడు ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 8వ వికెట్ కు అత్యంత విలువైన 114 పరుగులు జోడించారు. అయితే అశ్విన్ అవుటయ్యాక.. అక్షర్ పటేల్ ఎంతో సేపు నిలువలేదు. ఆఖరి వికెట్ గా షమీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత తొలి ఇన్నింగ్స్ కు తెర పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, IND vs AUS, India vs australia, Pat cummins, Ravichandran Ashwin, Ravindra Jadeja, Steve smith