IND vs AUS 1st Test : నాగ్ పూర్ (Nagpur) వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత (India) స్పిన్నర్లు రవీంద్ర జడేజా (Ravindra Jadeja), రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)ల దెబ్బకు విలవిల్లాడారు. వీరి ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 63.5 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. జడేజా 5 వికెట్లతో చెలరేగాడు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. షమీ, సిరాజ్ లు చెరో వికెట్ సాధించారు. ఆసీస్ తరఫున మార్నస్ లబుషేన్ (123 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ (37), అలెక్స్ క్యారీ (36), హ్యాండ్స్ కాంబ్ (31) మినహా మిగిలిన ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాను సిరాజ్, షమీలు దెబ్బ తీశారు. ఖవాజా (1)ని సిరాజ్ అవుట్ చేస్తే.. వార్నర్ (1)ని షమీ అవుట్ చేశాడు. అయితే మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ లు ఆడటంతో లంచ్ విరామానికి ఆసీస్ 76/2గా నిలిచింది. అయితే రెండో సెషన్ లో ఆస్ట్రేలియా కుప్పకూలింది. లబుషేన్ (49) అర్ధ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే స్పిన్ ను బాగా ఆడుతున్నా అనే అత్మవిశ్వాసం కాస్తా.. అతి విశ్వాసంగా అతడికి మారింది. దాంతో జడేజా బౌలింగ్ లో ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేసి స్టంపౌట్ అయ్యాడు. ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా పతనం మొదలైంది. ఆ తర్వాతి బంతికే రేన్ షా (0) ఎల్బీగా అవుటయ్యాడు. మరికాసేపటికే స్టీవ్ స్మిత్ (37) జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అయితే ఇక్కడి నుంచి కాసేపు క్యారీ (36), హ్యాండ్స్ కాబ్ లు జట్టును ముందుకు నడిపారు. ముఖ్యంగా క్యారీ రివర్స్ స్వీప్ షాట్లతో వేగంగా పరుగులు సాధించాడు. పలు బౌండరీలను కూడా సాధించాడు. అయితే అశ్విన్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ కు వెళ్లి వికెట్ల మీదకు ఆడుకున్నాడు. కెప్టెన్ కమిన్స్ (6), అరంగేట్రం హీరో మర్పీ (0) వెంట వెంటనే అవుటయ్యారు. టీ విరామం తర్వాత హ్యాండ్స్ కాంబ్ అవుటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.
తుది జట్లు
ఆస్ట్రేలియా
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, డేవిడ్ వార్నర్, లబుషేన్, స్మిత్, పీటర్ హ్యాండ్స్ కాబ్, అలెక్స్ క్యారీ, మ్యాట్, మర్ఫీ, లయన్, స్కాట్ బొలాండ్
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యదవ్, జడేజా, భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs AUS, India vs australia, Ravichandran Ashwin, Ravindra Jadeja, Steve smith