ఇస్లామాబాద్: టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడా సంరంభం 2020 ఒలింపిక్స్‌కు పాకిస్తాన్ నుంచి కేవలం 10 మంది అథ్లెట్లు మాత్రమే వెళ్లడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ తీవ్రంగా తప్పుబట్టాడు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో ఎంతమంది అథ్లెట్లు పాల్గొన్నారో.. 2021లో ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఎంతమంది పాల్గొన్నారో పోలుస్తూ ఉన్న ఫొటోను షేర్ చేసి మరీ తన అసంతృప్తిని బయటపెట్టాడు. ఇది చాలా బాధాకరమైన విషయమని ట్వీట్ చేశాడు. 220 మిలియన్ జనాభా ఉన్న దేశం నుంచి కేవలం 10 మంది అథ్లెట్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించడమా.. అని విస్మయం వ్యక్తం చేశాడు. క్రీడల్లో పాక్ ఇంతగా వెనకబడటానికి కారణమైన వారు, బాధ్యులు ఎవరైతే ఉన్నారో.. వారిని చూసి సిగ్గుపడుతున్నానని ఇమ్రాన్ నజీర్ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ పది మంది అథ్లెట్లతో పాటు పది మంది అధికారులను టోక్యో పంపింది. పాక్ తరపున 1956లో జరిగిన మెల్బోర్న్ వేదికగా జరిగిన ఒలింపిక్ క్రీడల్లో 62 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఒలింపిక్స్‌లో పాక్ అథ్లెట్లు కనిపించిన దాఖలాలు లేవు. ఒలింపిక్స్‌లో పది పతకాలను సాధించిన చరిత్ర కూడా పాకిస్తాన్ హాకీ టీంకు ఉంది. కానీ.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో పాక్ నేషనల్ హాకీ టీం వరుసగా రెండోసారి విఫలమైంది.
పాక్ హాకీ టీం చివరిగా 2012లో జరిగిన లండన్ ఒలింపిక్ గేమ్స్‌లో కనిపించింది. ఇదిలా ఉండగా.. భారత్ నుంచి 127 మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో 71 మంది అథ్లెట్లు పురుషులు కాగా.. 56 మంది అథ్లెట్లు మహిళలు కావడం గమనార్హం. భారత్‌తో పోల్చుకుంటే దాయాది దేశమైన పాకిస్తాన్ క్రీడల్లో ఎంత వెనకబడి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాక్ మీడియానే ఆ దేశం క్రీడల్లో వెనుకబడి ఉండటాన్ని భారత్‌తో పోల్చి మరీ విమర్శించడం అక్కడి పరిస్థితులకు నిదర్శనం.
This is actually sad. Just 10 athletes from a country of 220 million people.
— Imran Nazir (@realimrannazir4) July 24, 2021
To everyone who is responsible for Pakistan's such decline in sports , SHAME ON YOU! pic.twitter.com/4qkqC1cj7N
ఇదిలా ఉంటే.. ఒలింపిక్ ఆరంభ వేడుకలో పాక్ తరపున వెళ్లిన వారి నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆ దేశ జెండాను చూపుతూ వెనుక అథ్లెట్లు నడుస్తున్న సమయంలో వారిలో పలువురు మాస్క్‌లు ధరించడమే అందుకు కారణం. పెట్టుకున్న కొందరు కూడా మాస్క్‌ను ముక్కుకు కాకుండా గడ్డానికి పెట్టుకోవడం విమర్శలకు తావిచ్చింది. అసలే.. టోక్యోలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అసలు.. జరుగుతాయో లేదో అన్న తరుణంలో ఒలింపిక్స్ మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్‌లు కూడా పెట్టుకోకపోవడం ఏంటని పాక్ తరపున వెళ్లిన వారిపై క్రీడాభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Pakistan, Sports, Tokyo Olympics