హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2024: అమెరికా వరల్డ్ కప్ నుంచి ఫార్మాట్లో భారీ మార్పులు.. పెరగనున్న మ్యాచ్‌లు.. వేదికలు

T20 World Cup 2024: అమెరికా వరల్డ్ కప్ నుంచి ఫార్మాట్లో భారీ మార్పులు.. పెరగనున్న మ్యాచ్‌లు.. వేదికలు

టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్‌లో భారీ మార్పులు (PC: ICC)

టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్‌లో భారీ మార్పులు (PC: ICC)

T20 World Cup 2024: అమెరికా-కరేబియన్ దీవులు ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి జట్ల సంఖ్య పెరుగనున్నది. అంతే కాకుండా ఫార్మాట్ కూడా మార్చాలని ఐసీసీ నిర్ణయించింది.

  పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేయడానికి ఐసీసీ (ICC) నిర్ణయించుకున్నది. జట్ల సంఖ్యతో పాటు మ్యాచ్‌ల సంఖ్యను కూడా పెంచనున్నారు. క్రికెట్ ఆడే దేశాలు పెరుగుతుండటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో పొట్టి ప్రపంచ కప్ ఫార్మాట్ మార్చడానికే ఐసీసీ మొగ్గు చూపింది. అమెరికా-వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) నుంచి కొత్త ఫార్మాట్ అమలులోకి రానున్నది. క్రికెట్ చరిత్రలో తొలి సారిగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో (Cricket West Indies) కలసి యూఎస్ఏ క్రికెట్ వరల్డ్ కప్ ఆతిథ్యం కోసం బిడ్ దాఖలు చేసింది. భవిష్యత్ మార్కెట్, ఒలింపిక్స్‌ను (Olympics) దృష్టిలో పెట్టుకొని ఐసీసీ 2024 పొట్టి క్రికెట్ ఆతిథ్యపు హక్కులు అమెరికా-విండీస్‌కు కట్టబెట్టింది. అదే సమయంలో ఇప్పుడు ఉన్న ఫార్మాట్‌ను మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నది.

  2024 టీ20 వరల్డ్ కప్‌లో తొలిసారిగా 20 జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం 16 జట్లు టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నాయి. ఇందులో 8 జట్లు నేరుగా సూపర్ 12కు అర్హత సాధించగా.. మిగిలిన 4 స్పాట్ల కోసం 8 జట్లు తలపడుతున్నాయి. అయితే 2024 వరల్డ్ కప్ నుంచి ర్యాంకింగ్స్, ఇతర క్వాలిఫయర్స్ ద్వారా 20 జట్లు కప్పుకోసం తలపడనున్నాయి. ఈ 20 జట్లను 4 గ్రూపులుగా విభజించింది మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 2024 జూన్‌లో మొత్తం 25 రోజుల పాటు జరిగే టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 55 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. రౌండ్ రాబిన్ లీగ్, నాకౌట్ పద్దతుల్లో పొట్టి ప్రపంచ కప్ జరుగనున్నది.

  IND vs NZ: న్యూజీలాండ్‌పై అరంగేట్రం చేయనున్న ఐపీఎల్ స్టార్స్.. సీనియర్ల గైర్హాజరీలో యువకులకు చోటు?


   ఇక వెస్టిండీస్ క్రికెట్, యూఎస్ క్రికెట్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండటంతో 55 మ్యాచ్‌లను ఇరు బోర్డులకు పంచనున్నారు. యూఎస్ఏలో 20 మ్యాచ్‌లు, కరేబియన్ దీవుల్లో 35 మ్యాచ్‌లు జరుగుతాయి. కరేబియన్ దీవుల్లోని 13 క్రికెట్ స్టేడియంలతో పాటు యూఎస్ఏ‌లో ఎంపిక చేసిన 5 వేదికల్లో 55 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అంటే ఈ ప్రపంచకప్ మొత్తం 18 వేదికల్లో నిర్వహించనున్నారు. ఇన్ని ఎక్కువ వేదికల్లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం కూడా ఇదే తొలిసారి కాబోతున్నది. త్వరలోనే ఐసీసీ బృందం కరేబియన్ దీవులు, అమెరికాలో పర్యటించి వరల్డ్ కప్ నిర్వహించడానికి అనుకూలమైన వేదికలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తున్నది.


  కాగా, టీ20 వరల్డ్ కప్ హోస్ట్ రైట్స్ అమెరికాకు కేటాయించడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028ను దృష్టిలో పెట్టుకునే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నది. త్వరలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడానికి బిడ్ వేయనున్నది. ఒలింపిక్స్ ముందు అమెరికాలో క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించడం ద్వారా ఆటకు ఆదరణ పెంచడమే కాకుండా ప్రేక్షకుల మద్దతును కూడగట్టవచ్చని ఐసీసీ భావిస్తోంది. కరేబియన్ దీవుల్లో వరల్డ్ కప్ నిర్వహించడం ఇది నాలుగో సారి కాగా.. అమెరికా ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

  Published by:John Kora
  First published:

  Tags: ICC, T20 World Cup 2021, West Indies

  ఉత్తమ కథలు