• Home
 • »
 • News
 • »
 • sports
 • »
 • ICC T20 WORLD CUP INDIA LOOK TO KNOCK DOMINANT AUSTRALIA OFF THE PERCH AT THE MCG NK

ICC T20 World Cup : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా... నేడు మహిళల టీ-20 ప్రపంచకప్ ఫైనల్...

ICC T20 World Cup : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా... నేడు మహిళల టీ-20 ప్రపంచకప్ ఫైనల్...

ICC T20 World Cup : ఆదివారం మ్యాచ్‌లో టీమ్ ఇండియాకి బ్యాటింగ్ అనేది అస్త్రం కాదు. స్పిన్నర్లే కీలకం వాళ్లే ఆటను మలుపు తిప్పి... గెలుపు వాకిట నిలపగలరు.

 • Share this:
  ICC T20 World Cup : అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు.... ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటం ఆనందించదగ్గ విషయం. ఈ మ్యాచ్‌లో గెలుపు సాధించి... భారతీయ మహిళలకు గిఫ్టుగా ఇవ్వాలని టీమిండియా జట్టు పట్టుదలతో ఉంటే... కప్ సాధించి... తమ దేశ మహిళల ముఖాల్లో ఆనందం చూడాలని ఆస్ట్రేలియా టీమ్ కోరుకుంటోంది. ఐతే... 2017లో ఇలాగే ఫైనల్ చేరిన టీమిండియా... ఓటమిపాలైంది. 2018లో సెమీస్ చేరి వెనుదిరిగింది. ఇక ఇప్పుడు మరోసారి ఫైనల్ చేరిన భారత్... అంచనాలకు మించిన పెర్ఫార్మెన్సే ఇప్పటివరకూ చూపించింది. అందువల్ల గెలిచినా, ఓడినా... మహిళల భారత జట్టు ఆటతీరును అందరూ మెచ్చుకునే పరిస్థితే ఉంది. అయినప్పటికీ చివరి మ్యాచ్ మనదైతే... ఆ కిక్కే వేరు కదా... దాన్ని సాధించే బలమైన ఆకాంక్షతో భారత జట్టు ముందుకెళ్తోంది.

  సమస్యేంటంటే... ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్లు ఫుల్ ఫిట్‌నెస్‌తో ఉండేందుకు అన్ని సదుపాయాలూ లభించాయి. ఫలితంగా ప్రతిసారీ వాళ్లు ఫైనల్ దాకా వెళ్లి... కప్ కొట్టేస్తున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు విజేతలుగా నిలిచారు. అందువల్ల కంగారూలకు సొంతగడ్డ అయిన మెల్‌బోర్న్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌పై అందరి దృష్టీ ఉంది. ఐతే... పోరాట పటిమతో భారత జట్టు అందరిచేతా ప్రశంసలు పొందుతోంది. ప్రధానంగా ఈసారి అనూహ్యంగా దూసుకొచ్చిన షఫాలీ వర్మ... అద్భుతమైన పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్‌తో ఆసీస్ ప్లేయర్లకు కూడా షాకిస్తోంది. ఒక్కో షాట్‌నూ ఆమె 50 సార్లు ప్రాక్టీస్ చేయడంతో... ఈజీగా సిక్సర్లు బాదేస్తోంది. ఇవాళ ఆమె ఆరంభంలోనే రెచ్చిపోతే... విజయావకాశాలు భారత్ వశమవుతాయనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. ఐతే... పూర్తిగా ఆమెపైనే ఆధారపడటం సరికాదు కదా. ఓపెనర్ స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కూడా తలో చెయ్యీ వేస్తేనే ఆసీస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు వీలవుతుంది.

  బ్యాటింగ్ ఎలా ఉన్నా... ఈసారి భారత జట్టులో బౌలింగ్ అందర్నీ ఆకర్షిస్తోంది. మొత్తం టోర్నీలో ప్రతీ మ్యాచ్‌లో బౌలింగ్ వలే భారత్ ఫైనల్ దాకా వచ్చిందనుకోవచ్చు. ప్రధానంగా సూపర్ ఫామ్‌లో ఉన్న లెగ్గీ పూనమ్ యాదవ్... కంగారూలకు కంగారు పుట్టిస్తోంది. ఆసీస్ ప్లేయర్లు ప్రధానంగా పూనమ్‌ను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనే ఎక్కువ ప్రాక్టీస్ చేశారు. అంతలా ఆమె సవాల్ విసురుతోంది. అలాగే స్పిన్నర్లు రాధా యాదవ్‌, రాజేశ్వరి, పేసర్‌ శిఖాపాండే కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నారు. పిచ్ మాత్రం మొదట్లో బౌలర్లకూ తర్వాత బ్యాటర్లకూ అనుకూలంగా ఉంది. వర్షం పడే ఛాన్సే లేదు.

  ఈసారి గెలిచిన జట్టుకు రూ.7.40 కోట్లు, రన్నరప్‌ టీమ్‌కు రూ.3.70 కోట్లు ఇవ్వబోతున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 12.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ 1,2, దూరదర్శన్‌లలో వస్తుంది. దానికి ముందు 12 గంటలకు క్యాటీ పెర్రీ షో ఉంటుంది. మ్యాచ్ తర్వాత మళ్లీ క్యాటీ పెర్రీ షో క్లోజింగ్ సెరెమనీ ఉంటుంది.

  భారత్‌ జట్టు అంచనా : హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, తానియా భాటియా, వేద కృష్ణమూర్తి, పూనమ్‌ యాదవ్‌, శిఖా పాండే, రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌.

  ఆస్ట్రేలియా జట్టు అంచనా : మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), బెత్‌ మూనీ, అలీసా హీలీ, ఆష్లీ గార్డ్‌నర్‌, జెస్‌ జొనాసెన్‌, రాచెల్‌ హేన్స్‌, నికోలా కేరీ, డెలిస్సా కిమ్మిన్స్‌, జార్జియా వేర్‌హామ్‌/ మోలీ స్ట్రానో, మెగాన్‌ షట్‌, సోఫీ మోలినెక్స్‌.
  Published by:Krishna Kumar N
  First published: