Home /News /sports /

ICC T20 WORLD CUP 2021 5 BOLD DECISIONS TEAM INDIA CAPTAIN VIRAT KOHLI MAY TAKE IN THE MEGA TROPHY GH SRD

Virat Kohli Bold Decisions: ఊహించని నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ కెప్టెన్ కోహ్లీ.. టీ -20 ప్రపంచకప్‌లో విరాట్ తీసుకోగలిగే ఐదు ఆశ్చర్యకరమైన నిర్ణయాలు ఇవే..!

Virat Kohli

Virat Kohli

Virat Kohli Bold Decisions: 2017 ప్రారంభంలో మహేంద్ర సింగ్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగడంతో జట్టు పగ్గాలను కోహ్లీ చేపట్టాడు. అప్పటి నుంచి మంచి విజయాలను అందించాడు.

విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఈ రన్నింగ్ మెషిన్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐసీసీ ట్రోఫీలను అందుకోలేక పోయాడనే విమర్శ ఉన్నప్పటికీ, కెప్టెన్‌గా అత్యుత్తమ విజయాలను కోహ్లీ టీమిండియాకు అందించాడు. 2017 ప్రారంభంలో మహేంద్ర సింగ్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగడంతో జట్టు పగ్గాలను కోహ్లీ చేపట్టాడు. అప్పటి నుంచి మంచి విజయాలను అందించాడు. కోహ్లీ నాయకత్వంలో టీమిండియా 2019 ప్రపంచ కప్‌ టోర్నీలో సెమీస్ చేరింది. అంతేకాకుండా రెండు కీలక టోర్నీలైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. త్వరలో యూఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనున్న తరుణంలో మిగిలి ఉన్న ఆ ఆశ కూడా తీరితే.. విరాట్ అత్యుత్తమ సారథుల లిస్ట్ లో ముందు వరుసలో నిలుస్తాడు. టీమ్ సెలక్షన్, కొన్నిసార్లు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో కోహ్లీపై విమర్శలు వచ్చాయి. అయితే చాలాసార్లు ఈ నిర్ణయాల వల్ల జట్టు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలోనూ మన రన్నింగ్ మెషిన్ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడనుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాబట్టి వచ్చే టోర్నీలో విరాట్ తీసుకునేందుకు అవకాశమున్న 5 డేరింగ్ డెసిషన్స్ ఏవో అంచనా వేద్దాం.

* కోహ్లీ-రోహిత్ ఓపెనర్లుగా..
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇద్దరు వరల్డ్ క్లాస్ మేటి బ్యాట్స్ మెన్ ఓపెనింగ్ ఆడుతుంటే సగటు క్రికెట్ ప్రియుడు మనస్సు ఆనందంతో ఉప్పొంగుతుంది. ప్రత్యర్థులకు బౌలింగ్ వేయడం కత్తిమీద సామే. ఈ ఏడాది మార్చిలో జరిగిన భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో నిర్ణయాత్మక మ్యాచ్ లో కోహ్లీ-రోహిత్ ఓపెనింగ్ చేశారు. వీరిద్దరూ తొమ్మిది ఓవర్లలో 94 పరుగులు రాబట్టారు. రోహిత్ 34 బంతుల్లో 64 పరుగులతో అదరగొట్టగా.. కోహ్లీ డెత్ ఓవర్లలో వేగం పెంచాడు. 52 బంతుల్లో 80 పరుగులతో దుమ్మురేపాడు. దీంతో భారత్ 224 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. 3-2 తేడాతో సిరీస్ ను గెల్చుకుంది. వీరిద్దరూ ఓపెనింగ్ చేయడం వల్ల రోహిత్ తన సహజ శైలితో దూకుడుగా ఆడేందుకు అవకాశముంటుంది. కోహ్లీ చాప కింద నీరులా పారుతూ స్కోరు వేగాన్ని పెంచవచ్చు. అనంతరం సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయాస్ అయ్యర్ మిగిలిన కార్యాన్ని ముగించవచ్చు.

* తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు..
టీ20 ప్రపంచ కప్ జరగడానికి సరిగ్గా ఓ నెల ముందు యూఏఈ వేదికగా ఐపీఎల్ జరగనుంది. ఇలాంటి సమయంలో పిచ్‌లు స్పిన్నర్లకు కలిసి రావచ్చు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి జట్లలో అంత నాణ్యమైన స్పిన్నర్లు లేరు. టీమిండియాలో అత్యుత్తమ స్పిన్ దళముంది. యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లాంటి మెరుగైన స్పిన్నర్లు కోహ్లీ సేన సొంతం. కాబట్టి వీరిలో ముగ్గురిని తుదిజట్టులోకి తీసుకోవడం పెద్ద విషయమేమి కాదు. వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ కొత్త బంతితోనూ అద్భుతాలు చేయగలరు. జడ్డూ, సుందర్ లాంటి ఆల్ రౌండర్లు ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. కాబట్టి అవసరమైతే కోహ్లీ ముగ్గురు స్పిన్నర్లను తుదిజట్టులో ఆడించే అవకాశముంది.

* రోహిత్ శర్మ నాలుగో స్థానంలో..
కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుంటే ఎవరికైనా ఆశ్యర్యం, ఆగ్రహం కలగక మానవు. గత రెండేళ్లుగా రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్లో, ముఖ్యంగా ముంబయి ఇండియన్స్ తరఫున నాలుగో స్థానంలో అత్యుత్తమంగా ఆడుతూ మ్యాచ్ విన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓపెనర్‌గా ముంబయి ఇండియన్స్ జట్టులో హిట్ మ్యాన్ 48 మ్యాచ్ ల్లో 130 స్ట్రైక్ రేట్ తో 1273 పరుగులు చేశాడు. గణాంకాలు మెరుగ్గా కనిపించినప్పటికీ ఒక్క సీజన్లోనే 400 పరుగులు చేశాడు. అలా కాకుండా మిడిల్ ఆర్డర్లో కోహ్లీ, రోహిత్, పంత్ లాంటి అగ్రస్థాయి బ్యాట్స్ మెన్ ఉన్నట్లు ఊహించుకుంటే ప్రపంచంలోనే అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ టీమిండియాకు ఉంటుంది. కేఎల్ రాహుల్, ధావన్ ఓపెనర్లుగా ఆకట్టుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. ఐపీఎల్లో వీరిద్దరూ ఓపెనర్లుగా రాణిస్తే టీ20 వరల్డ్ కప్‌లో ఈ బ్యాటింగ్ లైనప్‌ను చూడవచ్చు.

* ఫామ్‌లో ఉన్న సిరాజ్‌కు అవకాశమివ్వడం..
నెట్ బౌలర్ నుంచి ఆర్సీబీలో కీలక బౌలర్‌గా మారే వరకు మహ్మద్ సిరాజ్‌కు విరాట్ కోహ్లీ ఎంతో దన్నుగా నిల్చాడు. తన ప్రయాణంలో విరాట్ పాత్ర ఎంతో ఉందని సిరాజ్ బహిరంగంగానే ప్రకటించాడు. ఈ ఏడాది జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో సిరాజ్ మూడు మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టి భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్రారంభ ఓవర్లను సిరాజ్‌తో వేయిస్తూ, డెత్ ఓవర్లలో బంతినిస్తూ కోహ్లీ అతడిపై అధిక విశ్వాసం ఉంచుతున్నాడు. విరాట్ నమ్మినట్లే సిరాజ్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ రెండో ఫేజ్‌లో అదరగొడితే టీ20 ప్రపంచ కప్ సిరాజ్ ఆడే అవకాశం చాలా ఎక్కువ.

* హార్దిక్ పాండ్య బదులు దీపక్ చాహర్..
పొట్టి ఫార్మాట్లో హార్దిక్ పాండ్య అత్యంత ప్రతిభకలిగిన ఆటగాడు. 49 టీ20ల్లో 484 పరుగులు చేయడమే కాకుండా.. 42 వికెట్లు తీశాడు. ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతుంది.. తన ప్రత్యర్థి ఆటగాళ్లకంటే పాండ్య ఎంత విలువైన ప్లేయరో. అయితే దీపక్ చాహార్ ను కూడా తక్కువ అంచనా వేయలేం. స్థిరంగా ఆడటమే కాకుండా ఇటీవల శ్రీలంక సిరీస్ 69* పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలర్ అయి ఉండి కూడా మెరుగైన ఆటతీరును కనబర్చాడు. హార్దిక్ పాండ్య ఐపీఎల్‌లో ఫామ్ అందుకోలేకపోతే దీపక్ చాహార్‌ను టీ20 వరల్డ్ కప్ తుదిజట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Cricket, Hardik Pandya, Rohit sharma, Sports, T20 World Cup 2021, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు