అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) లేటెస్ట్ గా టీ20 ప్రపంచకప్ 2021 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లను హాట్ ఫేవరెట్ జట్లగా నిపుణులు పరిగణిస్తున్నారు. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. అయితే, టీమిండియా మాజీ ఓపెనర్.. గౌతమ్ గంభీర్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ కూడా విజేతగా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని గౌతం గంభీర్ అన్నాడు. మెగాటోర్నీలో ఏ జట్టును అంచనా వేయడానికి లేదన్నాడు. అఫ్గాన్ జట్టులో రషీద్ ఖాన్ వంటి మ్యాచ్ విన్నర్లున్నారని, వారు మ్యాచ్ గమనాన్నే మార్చేస్తారని తెలిపాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ధి భారత్‌దే పై చేయి అవుతుందన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లోనే భారత్, పాకిస్థాన్ తలపడనున్న నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
" పాకిస్థాన్‌పై కూడా ఆశలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం పాక్‌తో పోల్చితే టీమిండియా బలమైన జట్టు. కానీ, టీ20ల్లో ఎవరు గెలుస్తారో ఎప్పుడూ ఊహించలేం. ఓ జట్టు మరో జట్టుపై గెలుస్తుందని పక్కాగా అంచనా వేయలేం. ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదు. అఫ్గానిస్థాన్ జట్టును కూడా తక్కువ చేయకూదు. రషీద్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ గమనాన్నే మార్చేస్తారు. పాకిస్థాన్ జట్టులోను అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవచ్చు. కానీ, భారత్‌తో ఆడేప్పుడు.. పాకిస్థాన్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. పరిస్థితులు తారుమారైతే అఫ్గాన్ జట్టు కూడా కప్ గెలిచే అవకాశముంది." అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
" బలమైన జట్లతో గ్రూప్ 1లో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. వెస్టిండీస్ ఆటను ఏ మాత్రం అంచనా వేయలేం. ఆ జట్టుకు ఉన్న ఫైర్ పవర్ బ్యాటింగ్ లైనప్‌తో మూడో టైటిల్ గెలుచుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంగ్లండ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆ జట్టు నిలకడగా రాణిస్తుంది. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత మరింత బలంగా తయారైంది. సీనియర్ ప్లేయర్ల గైర్హాజరీ నేపథ్యంలో ఆస్ట్రేలియా టీమ్ ప్రస్తుతం లయ తప్పినట్లు కనిపిస్తుంది. కానీ వారికి అచ్చొచ్చిన రోజున ఆ జట్టు చాలా ప్రమాదకరంగా చెలరేగుతోంది." అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో తొలి మ్యాచులోనే తలపడటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని కూడా ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు. "ఆరంభంలోనే పాక్‌తో తలపడితే టీమిండియాకు మేలు. అదే పనిగా పాక్ మ్యాచ్ గురించి ఆలోచించకుండా మిగతా టోర్నీపై దృష్టి పెట్టొచ్చు" అని గంభీర్ తెలిపాడు.
పాకిస్థాన్‌తో పోరుతో మెగా టోర్నీని ఆరంభించనున్న భారత్.. తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబరు 31న అబుదాబి వేదికగా న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. ఆ తర్వాత నవంబరు 3న అఫ్గానిస్థాన్‌తో ఆడుతుంది. భారత్ తన మిగతా రెండు సూపర్-12 మ్యాచ్‌లను క్వాలిఫయింగ్ గ్రూప్-బి విజేత (నవంబరు 5)తో, గ్రూప్-ఎ రన్నరప్ (నవంబరు 8)తో ఆడుతుంది. టోర్నమెంట్ తొలి రౌండ్ అక్టోబరు 17న ఒమన్‌లో ఆరంభమవుతుంది. గ్రూప్-ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ ఉన్నాయి. గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో అసలు దశ అయిన సూపర్ 12 అక్టోబరు 23న మొదలవుతుంది. తొలి సెమీఫైనల్ నవంబరు 10న అబుదాబిలో, రెండో సెమీఫైనల్ నవంబరు 11న దుబాయ్‌లో ఆడతారు. నవంబరు 14న జరిగే ఫైనల్‌కు దుబాయ్ ఆతిథ్యమిస్తుంది. నవంబర్ 15 రిజర్వ్ డే. ఈ మెగా టోర్నీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Cricket, Gautam Gambhir, Sports, T20 World Cup 2021