ఇండియా వేదికగా అక్టోబర్ 18 నుంచి జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను (T20 World Cup) యూఏఈకి (UAE)తరలించినట్లు సమాచారం. కరోనా కారణంగా ఇండియాలటో మెగా టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని భావించిన ఐసీసీ (ICC) అక్టోబర్ 17 నుంచి పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను యూఏఈ వేదికగా నిర్వహించడానికి తుది నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు క్రీడా వెబ్‌సైట్ 'క్రిక్ఇన్ఫో' ఒక కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి జూన్ 28 వరకు గడువు ఇచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యూఏఈనే బెటర్ ఛాయిస్ అని ఐసీసీ భావించింది. బీసీసీఐ తమ నిర్ణయాన్ని చెప్పక ముందే అనధికారికంగా షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. యూఏఈలో ఐపీఎల్ ఫైనల్ (అక్టోబర్ 15) ముగిసిన రెండు రోజుల తర్వాత టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది. నవంబర్ 14న ఫైనల్ నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వారంలో రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
అక్టోబర్ 15 నుంచి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు యూఏఈ, ఒమన్ వేదికగా ప్రారంభం కానున్నాయి. మొత్తం 12 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో 8 జట్లు తలపడతాయి. రెండు గ్రూపులుగా విడగొట్టి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వీటిలో నుంచి నాలుగు జట్లు సూపర్ 12కు క్వాలిఫై అవుతాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్. నెదర్లాండ్స్. స్కాట్లాండ్. నమీబియా. ఒమన్. పపువా న్యూ గినియా జట్లు ఆడనున్నాయి. ఇక టాప్ 8 ర్యాంకులో ఉన్నజట్లు, క్వాలిఫై అయ్యే 4 జట్లతో కలిపి అక్టోబర్ 24 నుంచి సూపర్ 12 గ్రూప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. సూపర్ 12 ను ఆరు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా చేసి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. యూఏఈలోని దుబాయ్, అబుదాబి. షార్జా వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదే వేదికల్లో ప్లేఆఫ్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
రౌండ్ 1 మ్యాచ్‌లు యూఏఈతో పాటు ఒమన్‌లో నిర్వహించనున్నారు. ఐసీసీ ఇప్పటికే బీసీసీఐకి ఈ సమాచారం తెలియజేసింది. అక్టోబర్ 15న ఐపీఎల్ ముగియనుండటంతో 9 రోజుల్లో యూఏఈ స్టేడియంలో సూపర్ 12 మ్యాచ్‌లకు సిద్దం చేయనున్నారు. ఇక బీసీసీఐ ఈ మ్యాచ్‌లకు కో-హోస్ట్‌గా వ్యవహరిస్తున్నదా లేదా అనే విషయంపై స్పష్టత రావల్సి ఉన్నది. కరోనా మహమ్మారి కనుక లేకపోయినట్లయితే ఇండియాలోని 9 నగరాల్లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణకు బీసీసీఐ ఏర్పాట్లు చేయాలని భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తేలడంతోనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో పాటు మెగా ఈవెంట్‌కు సంబంధించిన ట్యాక్స్ సమస్య కూడా పరిష్కారం కాలేదు. అందుకే ఐసీసీ నిర్ణయానికి బీసీసీఐ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, ICC, T20 World Cup 2021, UAE