India vs Australia | వరల్డ్ కప్ 2019 టోర్నీలో మరో ఆసక్తికర మ్యాచ్కు రంగం సిద్ధమైంది. వరల్డ్ కప్ ను ఎలాగైనా గెలుచుకోవాలని పంతంతో ఉన్న భారత్, ఆస్ట్రేలియా ఆదివారం కెనింగ్టన్ ఓవల్ మైదానంలో తలపడనున్నాయి. రెండు జట్లు ఈ టోర్నీలో ఓటమి చూడలేదు. గత మ్యాచ్ లో సఫారీలపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా, ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై సైతం అదే స్థాయిలో రాణించాలని ప్రణాళికలు వేసుకుంది. కోహ్లీ సేనలో రోహిత్ గత మ్యాచ్ లో సెంచరీ కొట్టి ఫామ్ లోకి రావడం కలిసి వచ్చే అంశం. అలాగే టీమిండియా బౌలర్లు సైతం గత మ్యాచ్ లో సత్తా చూపించారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ లలో నెగ్గింది. ఈ మ్యాచ్ లో ఎవరు ఓటమి పాలైనా వారికి మొదటి పరాజయం ఇదే మ్యాచ్ లో మూటగట్టుకోనున్నారు. ఈ నెల 16న పాకిస్థాన్ తో తలపడనున్న కోహ్లీ సేన ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఉత్సాహంగా పాక్ తో తలపడాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళుతోంది. టీమిండియా బౌలింగ్ విభాగంలో బుమ్రా చక్కగా రాణిస్తున్నాడు. అయితే ఓవల్ పిచ్ విషయానికి వస్తే ఇది ప్రధానంగా బ్యాటింగ్ కు అనుకూలమైనది. ఇదే పిచ్ పై బంగ్లాదేశ్ సౌతాఫ్రికాపై 330 పరుగులు సాధించడం విశేషం. అందుకే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.
బ్యాటింగ్ పరంగా చూస్తే ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ రాక ఆస్ట్రేలియాకు అదనపు బలమనే చెప్పవచ్చు. భారత బౌలింగ్ ను చక్కగా అర్థం చేసుకొని అటాక్ చేసే స్వభావం వార్నర్ సొంతం. అలాగే స్మిత్ సైతం నిలకడగా రాణిస్తున్నాడు. భారత్ పై పరుగులు సాధించడంలో స్మిత్ కు మంచి రికార్డు ఉంది. అలాగే మ్యాక్స్ వెల్ సైతం ప్రమాదకరమైన బ్యాట్స్ మెన్, ఇతను సిక్సర్లు, బౌండరీలతో చెలరేగితే మ్యాచ్ ఫలితం తారుమారవ్వడం ఖాయం. ఫించ్ సైతం వేగంగా పరుగులు రాబట్టడంలో నిపుణుడనే చెప్పాలి. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం కూడా బలంగానే కనిపిస్తోంది. స్టార్క్, కమిన్స్ నిలకడగా రాణిస్తున్నారు. అలాగే స్నిన్నర్ జంపా సైతం ప్రమాదకరమైన వాడే...
కోహ్లీ, కెఎల్ రాహుల్ పైనే భారం...
ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ చెలరేగి ఓపెనర్లు పెవిలియన్ బాటపడితే మాత్రం, బ్యాటింగ్ భారం కోహ్లీపై పడనుంది. అలాగే కెఎల్. రాహుల్ సైతం ఈ బాధ్యతను మోయాల్సి ఉంటుంది. వీరితో పాటు ధోనీ సైతం మిడిలార్డర్ భారాన్ని మోసే అవకాశం ఉంది. వికెట్లు పడకుండా ఉంటే ఓవల్ పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 350 పరుగులు చేయడం ఖాయమనే చెబుతున్నారు.
మ్యాచ్కు వరుణ గండం ...
ప్రస్తుతం లండన్ లో వాతావరణం మేఘావృతమై ఉంది. అడపా దడపా వర్షం కురుస్తూనే ఉంది. వర్షం దెబ్బకు టీమిండియా ప్రాక్టీసుకు సైతం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బలంగా గాలులు వీస్తుండటం కూడా మ్యాచ్ కు ప్రతికూలంగా మారనుంది.
Published by:Krishna Adithya
First published:June 09, 2019, 09:17 IST