వరల్డ్ కప్ సమరం తుది దశకు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఇంటి దారి పట్టగా, రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. 224 పరుగులకే కంగారులు ఆలౌట్ అవ్వగా... కేవలం రెండు వికెట్లు కోల్పోయి మోర్గాన్ సేన లక్ష్యాన్ని ఛేదించింది. వెరసి.. ఇప్పటి దాకా వరల్డ్ కప్‌ను ముద్దాడని రెండు జట్లు ఫైనల్ బరిలో నిలిచాయి. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కివీస్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. అయితే, ఓ సెంటిమెంట్‌తో పాటు, హోం గ్రౌండ్ ఇంగ్లండ్‌కు కలిసి వస్తోంది. అదేంటంటే.. 2011 నుంచి వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన జట్టే ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోతోంది.
2011లో వరల్డ్ కప్ ఫైనల్ ఇండియాలో జరగ్గా.. శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ ఆతిథ్యం ఇచ్చాయి. ఆతిథ్య జట్లే ఫైనల్ చేరాయి. ఆ మ్యాచ్‌లో శ్రీలంకపై ధోని సేన ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ధోని సిక్స్ బాది తనదైన స్టైల్లో భారత్‌కు ప్రపంచకప్‌ను అందించాడు. ఇక, 2015 విషయానికి వచ్చేసరికి.. మళ్లీ ఆతిథ్య జట్లే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఫైనల్‌కు వెళ్లాయి. ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించి ఐదో సారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది.
ఇక, ఈ ఏడాది వరల్డ్ కప్ వచ్చేసరికి.. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు కివీస్ సేనతో పోరాడుతుంది. ఒక వేళ గత రెండు ప్రపంచకప్‌ల మాదిరే ఈ సారి కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయితే, ఇంగ్లండ్ ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోతుంది.
ఆశ్చర్యకర విషయమేమిటంటే.. 2007 వరల్డ్ కప్ వరకు ఆతిథ్యం ఇచ్చిన ఏ దేశం కూడా ప్రపంచ కప్ గెలవలేదు. ఆ సెంటిమెంటును బ్రేక్ చేస్తూ ధోని సేన 2011లో వరల్డ్ కప్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుండటం నిజంగా విశేషమే.