ఈ ఏడాది జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ ఎవరూ మరిచిపోలేరు. నరాలు తెగే ఉత్కంఠ. విజయం ఎవరిని వరిస్తుందో అన్న సస్పెన్స్. ప్రపంచ విజేతగా నిలిచేందుకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ అలుపెరగని పోరాటం. అయితే ఈసారి జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా రెండు టీంల స్కోర్‌తో పాటు సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. దీంతో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ జట్టునే విజేతగా ప్రకటించింది ఐసీసీ. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వినిపించాయి. న్యూజిలాండ్ టీం ఓటమిని ఎవరూ అంగీకరించలేదు. దీంతో ఈ ఘటనపై దిద్దుబాటు చర్యు చేపట్టిన ఐసీసీ... సూపర్ ఓవర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి వరల్డ్‌కప్ సెమీస్, పైనల్లో సూపర్‌ఓవర్ టైగా మారితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించబోమని ఐసీసీ పేర్కొంది. స్పష్టమైన విజేత తేలేవరకు సూపర్ ఓవర్లు ఆడిస్తామని స్పష్టం చేసింది. సోమవారం జరిగిన సమావేశంలో ఐసీసీ ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సూపర్ ఓవర్ టైగా మారితే బౌండరీలు అత్యధికంగా బాదిన జట్టును విజేతగా ప్రకటించేవారు. ఇక నుంచి ఆ నిబంధన క్రికెట్‌లో వర్తించదు.సూపర్ ఓవర్ కూడా టై అవుతుంటే, ఫలితం వచ్చేంత వరకూ సూపర్ ఓవర్లను ఆడిస్తూనే ఉండాలని ఐసీసీ స్పష్టం చేసింది. నాకౌట్ దశలో మాత్రమే ఆడిస్తున్న సూపర్ ఓవర్లు ఇకపై లీగ్ దశలోనూ ఉంటాయని, ఒకసారి సూపర్ ఓవర్ టై అయితే, మ్యాచ్ టై అయినట్టేనని ఐసీసీ పేర్కొంది. జింబాబ్వే, నేపాల్ జట్లపై గతంలో విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్టు వెల్లడించింది.