• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • ICC BAN ON FORMER SRILANKAN CRICKETER AND COACH WHAT HAPPENED IN 2017 JNK

Cricket : ఫిక్సింగ్‌లో ఇరుక్కున్న క్రికెటర్.. 6 ఏళ్ల నిషేధం విధించిన ఐసీసీ.. అసలు ఏం జరిగింది?

Cricket : ఫిక్సింగ్‌లో ఇరుక్కున్న క్రికెటర్.. 6 ఏళ్ల నిషేధం విధించిన ఐసీసీ.. అసలు ఏం జరిగింది?

బుకీలతో చేతులు కలపిన శ్రీలంక మాజీ క్రికెటర్

  • Share this:
    అంతర్జాతీయ క్రికెట్‌ను (International Cricket) పట్టుకొని పీడిస్తున్న మ్యాచ్ ఫిక్సింగ్‌ను రూపుమాపాలని ఐసీసీ ఎన్నేళ్లుగానో ప్రయత్నిస్తుంది. ఇందు కోసం ఐసీసీ (ICC) ప్రత్యేక రూల్ బుక్‌ను రూపొందించింది. అందులోని నిబంధనలు క్రికెటర్లు, కోచ్‌లు, క్రికెట్ బోర్డులతో సంబంధం ఉన్న ఎవరైనా పాటించాల్సిందే. కానీ కొంత మంది డబ్బు, ఇతర ప్రలోభాలకు ఆశపడి మ్యాచ్‌లను ఫిక్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇతరులను ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యేలా ప్రేరేపిస్తున్నారు. అలా ఫిక్సింగ్ (Match Fixing)మాఫియాతో చేతులు కలిపిన శ్రీలంక మాజీ పేసర్, కోచ్ నువాన్ జోయ్‌సా (Nuwan Zoysa) దోషిగా తేలడంతో ఐసీసీ అతడిపై ఆరేళ్ల నిషేధాన్ని విధించింది. ఇండియాకు చెందిన ఒక బుకీతో చేతులు కలిపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించడమే కాకుండా, సదరు విషయాలను దాచి పెట్టే ప్రయత్నం చేసినట్లు ఐసీసీ నిర్దారించింది. జోయ్‌సాపై ఆరోపణలు రావడంతో 2018 అక్టోబర్ 31నే అతడిని సస్పెండ్ చేసింది. రెండేళ్ల విచారణ అనంతరం అతడిపై ఆరోపణలు నిజమేనని తేలడంతో నిషేధం విధించినట్లు ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ మీడియాకు వెల్లడించారు.

    శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించి.. ఒక జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న క్రికెటర్ ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. అతడే స్వయంగా అవినీతికి పాల్పడటం.. ఇతరులను ఆ దిశగా ప్రేరేపించడం తీవ్రమైన నేరాలని అలెక్స్ మార్షల్ అన్నారు. శ్రీలంక 'ఏ' జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పని చేస్తున్న సమయంలో 2017లో కొలంబోలో ఇండియాకు చెందిన ఒక బుకీతో నువాన్ జోయ్‌సాకు పరిచయం ఏర్పడింది. రెండు మూడు సార్లు అతడిని కలిసిన తర్వాత ఐసీసీ నిషేధ జాబితాలో ఉన్న బుకీల్లో ఒకరే అతడని నువాన్ గుర్తించాడు. ఆ విషయాన్ని ఐసీసీకి తెలియజేయకుండా నువాన్ అతడితో సంబంధాలు కొనసాగించాడు. అంతే కాకుండా అతడితో కలసి ఫిక్సింగ్‌కు పాల్పడటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలో 2017లో జోయ్‌సా ఒక క్రికెటర్‌ను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు. ఏదైనా ఒక ఓవర్‌లో 15 పరుగుల కంటే ఎక్కువ ఇవ్వమని.. లేదంటే త్వరగా ఔటై పోమ్మని.. ఇందుకు అతడికి భారీ మొత్తంలో డబ్బు వస్తుందని చెప్పాడు. అయితే జోయ్‌సా ప్రతిపాదనకు సదరు క్రికెటర్ ఒప్పుకోలేదు. అంతే కాకుండా ఈ విషయాన్ని క్రికెట్ బోర్డుకు తెలిపాడు. ఆ తర్వాత జోయ్‌సా అవినీతిపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కేసు నమోదు చేసింది. యూఏఈలో జరిగిన ఒక టీ10 టోర్నీలో శ్రీలంక ఏ టీమ్ కోచ్‌గా ఉన్న సమయంలో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఐసీసీ తరపున ఈసీబీ అతడిపై కేసు నమోదు చేసింది. దీనిపై పూర్తి విచారణ చేపట్టిన అనంతరం తాజాగా ఐసీసీ అతడిపై ఆరేళ్ల నిషేధం విధించింది. ఈ కాలంలో అతడు క్రికెట్‌తో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండకూడదని ఆదేశించింది.

    42 ఏళ్ల నువాన్ జోయ్‌సా శ్రీలంక తరపున 30 టెస్టులు, 90 వన్డేలు ఆడాడు. 2017లో శ్రీలంక జట్టు యూఏఈలో టీ10 సిరీస్ ఆడటానికి వెళ్లినప్పుడు అతడు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఇటీవలే మాజీ పేసర్ దిల్హారా మీద ఐసీసీ 8 ఏళ్ల నిషేధం విధించింది, 2019లో సనత్ జయసూర్యపై యాంటీ కరప్షన్ యూనిట్ నిషేధం విధించింది.
    Published by:John Naveen Kora
    First published: