Azharuddin Suspended : అజారుద్దీన్‌పై ఆరోపణలేంటి? బీసీసీఐకి వ్యతిరేకంగా ఏం చేశాడు? దుబాయ్ లీగ్ సంగతేంటి?

మహ్మద్ అజారుద్దీన్ పైన ఆరోపణలు ఏమిటి? (File Photo)

హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజార్‌ను తప్పించడం వెనుక కారణం ఏమిటి? బీసీసీఐకి వ్యతిరేకంగా దుబాయ్ టీ10 లీగ్‌లో భాగస్వామ్యం అయ్యాడా? ఆర్థిక లావాదేవీల్లో జరిగిన తతంగం ఏమిటి?

 • Share this:
  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) (HCA) అధ్యక్ష పదవి (President) నుంచి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను (Mohammad Azharuddin) సస్పెండ్ చేస్తూ అపెక్స్ కౌన్సిల్ (Apex Council) తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులైన కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ, కోశాధికారి సురేందర్ కుమార్ అగర్వాల్, కౌన్సిలర్ పి అనురాధ సంయుక్తంగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. అందులో అజారుద్దీన్ బీసీసీఐ, హెచ్‌సీఏ నిబంధనలకు విరుద్దంగా ఎలా ప్రవర్తించారో కూలంకషంగా వివరించారు. హెచ్‌సీఏ జనరల్ బాడీ సభ్యుల నుంచి పలు పిర్యాదులు అందాయి. వీటిపై విచారణ జరిపేందుకు జూన్ 10న అపెక్స్ కౌన్సిల్ భేటీ అయ్యింది. అజార్‌పై వచ్చిన ఆరోపణలను పూర్తిగా పరిశీలించింది. అజారుద్దీన్ దుబాయ్‌లో నార్తరన్ వారియర్స్ అనే క్లబ్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ గుర్తించని టీ10 లీగ్‌లో పాల్గొంటున్న ఈ క్లబ్‌కు అజార్ మెంటార్‌గా వ్యవహరించడం నిబంధనలకు విరుద్దమే కాకుండా పరస్పర విరుద్ద ప్రయోజనాల చట్టం కిందకు వస్తుందని అపెక్స్ కౌన్సిల్ నిర్దారించింది.

  హెచ్‌సీఏ రూల్ నెంబర్ 38(1)(3) ప్రకారం ఒక అనధికార లీగ్‌లోని క్లబ్‌కు మెంటార్‌గా ఉండి నిబంధనలు ఉల్లంఘించాడు. ఇక అజారుద్దీన్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదనేది మరో ఆరోపణ. 2019 డిసెంబర్ 14న హెచ్‌సీఏ కార్యదర్శికి రాసిన లేఖలో తాను చివరి మ్యాచ్ ఆడిన 2000 మార్చి 6నే రిటైర్ అయినట్లు పరిగణించాలని కోరాడు. అదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయాలని కూడా లేఖలో పేర్కొన్నాడు. అంటే 19 ఏళ్ల పాటు తన రిటైర్మెంట్ గురించి చెప్పని అజారుద్దీన్.. అగస్మాత్తుగా 2019లో కేవలం ఒక లేఖ ద్వారా అప్పుడే రిటైర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డులో గానీ, అనుబంధ క్రికెట్ అసోసియేషన్లలో గానీ పదవి చేపట్టాలంటే క్రికెటర్లు రిటైర్ అయిన 5 ఏళ్ల తర్వాత మాత్రమే సాధ్యపడుతుంది. అయితే కీలకమైన హెచ్‌సీఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అజారుద్దీన్ తన రిటైర్మెంట్ గురించి ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.

  హెచ్‌సీఏకు దిల్‌షుక్‌నగర్‌లో ఉన్న కెనరా బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన లావాదేవీల్లో కూడా అవకతవకలను గుర్తించారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అపెక్స్ కౌన్సిల్ వెంటనే అజారుద్దీన్‌ను పదవి నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. న్యాయ పరంగా ఈ విషయాలపై పూర్తి విచారణ పూర్తయ్యే వరకు అజారుద్దీన్ సస్పెన్షన్‌లోనే ఉంటాడని పేర్కొన్నది. కాగా, గత రెండేళ్లుగా అపెక్స్ కౌన్సిల్‌లోని సభ్యులకు, అధ్యక్షుడు అజారుద్దీన్‌కు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. పలు మార్లు ఈ రాజకీయాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించుకున్నారు. ఇప్పుడు అజారుద్దీన్‌పై వేటు వేయడంతో హెచ్‌సీఏ రాజకీయాలు మరోసారి రచ్చకు ఎక్కాయి.
  Published by:John Naveen Kora
  First published: