బీసీసీఐ (BCCI) ఇప్పటి వరకు చేయని సరికొత్త ప్రయోగం శ్రీలంక పర్యటనలో (Srilanka tour) చేస్తున్నది. టీమ్ ఇండియా (Team India) టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే.. వన్డే స్పెషలిస్టులతో కూడాని మరో టీమ్ (బీ టీమ్)ను రెడీ చేసి శ్రీలంక పర్యటనకు పంపనున్నది. ఇప్పటికే శ్రీలంక పర్యటనకు సంబంధించి మూడు వన్డేలు, మూడు టీ20లకు సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్ శ్రీలంక విడుదల చేసింది. జులైలో జరుగనున్న ఆ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమ్‌ను ఎంపిక చేసే బాధ్యతను సెలెక్టర్లపై పెట్టింది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి క్రికెటర్లు లేకుండా కొత్త జట్టును ఎంపిక చేయాల్సి ఉన్నది. మొయిన్ ప్లేయర్లే లేకపోవడంతో బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయడం సులభమేనని అందరూ భావించారు. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందు పలు ఆప్షన్లు ఎదురు చూస్తున్నాయి. జట్టులో ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. గత కొన్నేళ్లుగా బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేసింది. అంతే కాకుండా ఐపీఎల్ ద్వారా మరింత మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలో సెలెక్టర్ల ముందు అనేక ఆప్షన్లు కనపడుతున్నాయి. మరోవైపు ఎవరిని తీసుకోవాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు.
భారత జట్టు బలం మొదటి నుంచి బ్యాటింగే. ప్రస్తుతం సెలక్లర్లకు శిఖర్ ధావన్, పృథ్వీషా, దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ రూపంలో నలుగురు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. కాగా, పరిమిత ఓవర్ల క్రికెట్లో రెగ్యులర్ ఓపెనర్ అయిన శిఖర్ ధావన్‌తో పాటు ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఐపీఎల్లో ధావన్, పృథ్వీషా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనింగ్ చేశారు. ఈ ఏడాది వాళ్ల గణాంకాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. మరోవైపు పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగానే కాకుండా టాప్ ఆర్డర్లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలరు. ఇక ఫస్ట్ డౌన్లో సంజూ శాంసన్ బెస్ట్ చాయిస్ అవ్వొచ్చు. గత కొన్నేళ్లుగా వన్ డౌన్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇక ఆ తర్వాత స్థానాల్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా పోటీ పడుతున్నారు. ఇటీవల ఐపీఎల్లో రాణిస్తున్న రాహుల్ తెవాతియా, అబ్దుల్ సమద్, నితీశ్ రాణా లను కూడా పరిశీలించే అవకాశం ఉన్నది. ఆల్‌రౌండర్ల స్థానాన్ని పాండ్యా బ్రదర్స్ పూర్తి చేయగలరని సెలెక్టర్లు భావిస్తున్నారు.
ఇక కీలకమైన బౌలింగ్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్ నడిపించే అవకాశం ఉన్నది. అయితే ఇటీవల వరుస గాయాలతో ఫిట్నెస్ కోల్పోయి ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరమైన భువీని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటారా లేదా అనే విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. ఇక అతడితో పాటు నవదీప్ సైనీ, దీపక్ చాహర్ అందుబాటులో ఉన్నారు. ఐపీఎల్లో రాణించిన హర్షల్ పటేల్, చేతన్ సకారియాలకు ఛాన్స్ దొరకవచ్చు. వీరితో పాటు గతంలో టీమ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన జయదేవ్ ఉనద్కత్, ఖలీల్ అహ్మద్ లను కూడా పరిశీలించవచ్చు. యజువేంద్ర చాహల్ , కుల్దీప్ యాదవ్ వంటి అనుభవం ఉన్న రెగ్యులర్ స్పిన్నర్లు జట్టకు తప్పకుండా బలం అవుతారు. చాహల్, కుల్దీప్ ద్వయం గత ఏడాదిన్నరగా కలసి బౌలింగ్ చేయలేదు. అయితే వీరిద్దరినీ శ్రీలంకలో చూసే అవకాశం ఉన్నది. వీరికి తోడు వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్‌లకు కూడా సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉన్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, Team India