Home /News /sports /

HUGE CHANGES IN IPL 2022 ONLY FOUR PLAYERS TO BE RETAINED HYDERABAD COMPANY IN NEW FRANCHISE RACE JNK

IPL 2022 : ఐపీఎల్ 15 సీజన్‌లో భారీగా మార్పులు.. నలుగురు ఆటగాళ్లకే రిటెన్షన్.. కొత్త ఫ్రాంచైజీ రేసులో హైదరాబాద్ కంపెనీ

ఐపీఎల్ 2022లో భారీ మార్పులు.. నలుగురికే ఛాన్స్ (IPL)

ఐపీఎల్ 2022లో భారీ మార్పులు.. నలుగురికే ఛాన్స్ (IPL)

ఐపీఎల్ 2022లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆటగాళ్ల వేలం దగ్గర నుంచి ప్రసార హక్కుల వరకు బీసీసీఐకి ఆదాయం సమకూరనున్నది. మరోవైపు కొత్త ఫ్రాంచైజీల కోసం కూడా భారీ పోటీ నెలకొన్నది.

    ఐపీఎల్ 2022లో (IPL 2022) భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తున్నది. రెండు కొత్త ఫ్రాంచైజీలను యాడ్ చేయడంతో పాటు ఇప్పుడు ఆయా జట్లతో ఉన్న ఆటగాళ్ల కొనసాగింపుపై కూడా బీసీసీఐ (BCCI) సరికొత్త నిబంధనలు తీసుకొని రానున్నది. ఈ మేరకు ఒక ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు ఐపీఎల్ 15వ సీజన్ (ఐపీఎల్ 2022)లో కొత్తగా రెండు ఫ్రాంచైజీలు (New Franchise) జత కలవనున్నాయి. వీటి కోసం సెప్టెంబర్‌లో బీసీసీఐ టెండర్లు పిలవనున్నది. ఐపీఎల్ 2021లోని (IPL 2021) మిగిలిన మ్యాచ్‌లు ముగిసేలోపే కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నట్లు తెలుస్తున్నది. కనీస ధర రూ. 2 వేల కోట్లతో టెండర్లు ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఈ ఫ్రాంచైజీల కోసం భారీగా పోటీ నెలకొన్నది. కోల్‌కతాకు చెందిన సంజీవ్ గోయెంకా గ్రూప్, అహ్మదాబాద్‌కు చెందిన అదానీ గ్రూప్, హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా, గుజరాత్‌కు చెందిన టొరెంటో గ్రూప్ కొత్త ఫ్రాంచైజీల కోసం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే అదానీ గ్రూప్ ఎంత భారీ మొత్తమైనా వెచ్చించి అహ్మదాబాద్ కేంద్రంగా కొత్త ఫ్రాంచైజీ తీసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రెండో ఫ్రాంచైజీ దక్షిణ భారత దేశంలో ఉంటుందా? పూణే లేదా లక్నో వేదికగా వస్తుందా అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మ రెండో ఫ్రాంచైజీ కోసం బిడ్లు దాఖలు చేయనున్నది.

    ఇక ఇప్పటికే ఉన్న 8 ఫ్రాంచైజీలను కలవరపెడుతున్న అంశం బీసీసీఐ కొత్తగా తీసుకొని వస్తున్న రిటెన్షన్ పాలసి. దీని ప్రకారం ఆయా ఫ్రాంచైపీలు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొని కొనసాగించడానికి వీలుంటుంది. అందులో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. మొత్తం నలుగురిలో ఇద్దరు భారత ప్లేయర్లు, మరో ఇద్దరు ఫారిన్ ప్లేయర్లు ఉండాలి. అలా కాకుండా ముగ్గురు ఇండియన్, ఒక ఫారిన్ ప్లేయర్‌ను కూడా తీసుకోవచ్చు. లేదంటే ఎవరినీ రిటైన్ కూడా చేసుకోకుండా ఉండవచ్చు. అయితే రిటైన్ చేసుకున్న ప్లేయర్లకు జీతాలు ఎలా చెల్లించాలో కూడా బీసీసీఐ నిబంధనలు రూపొందించింది. ముగ్గురిని తీసుకుంటే రూ. 15 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 7 కోట్లు ఇవ్వాలి. ఇద్దరిని తీసుకుంటే రూ. 12.5 కోట్లు, రూ. 8.5 కోట్లు ఇవ్వాలి. ఒకరినే తీసుకుంటే రూ. 12.5 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

    మరోవైపు ప్రతీ ఫ్రాంచైజీకి ఇప్పటి వరకు ఉన్న రూ. 85 కోట్ల పర్స్ వాల్యూను రూ. 90 కోట్లు పెంచారు. ప్రతీ ఫ్రాంచైజీ ఈ పర్స్ వాల్యూలో నుంచి కనీసం 75 శాతం ఆటగాళ్ల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక వచ్చే ఏడాది జనవరిలో టీవీ, డిజిటల్ ప్రసార హక్కుల కోసం టెండర్లు పిలవనున్నారు. గతంలో కేవలం 60 మ్యాచ్‌లే ఉండేవి. కానీ ఇప్పుడు 10 జట్లకు పెరగడంతో మ్యాచ్‌ల సంఖ్య 90కి దాటిపోయే అవకాశం ఉన్నది. టీవీ ప్రసార హక్కుల ద్వారా గతంలో కంటే 75 శాతం అధికంగా బీసీసీఐ ఖజానాకు జమ కావొచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, Cricket, IPL 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు