WTC Final : మెగా ఫైట్ కు ముందు కేన్ మామకు గాయం..కివీస్ శిబిరంలో టెన్షన్..టెన్షన్..

Kane Williamson

WTC Final : క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఫైట్ (WTC Final) కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే న్యూజిలాండ్ ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుండగా...ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే, ఈ కీలక పోరుకు ముందు న్యూజిలాండ్ టీమ్ లో టెన్షన్ మొదలైంది.

 • Share this:
  WTC Final కు ముందు కివీస్ టీమ్ లో కలవరం మొదలైంది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson) మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరగుతున్న టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు ఆఖరిరోజు అతని ఎడమ మోచేతికి గాయం అయింది. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించి గాయం తీవ్రత పెద్దగా లేదని.. రెండ్రోజులు రెస్ట్‌ తీసుకుంటే సరిపోతుందని తెలిపాడు. కానీ కేన్‌ గాయం కివీస్‌ను కలవరానికి గురిచేస్తుంది. గాయం తీవ్రత ఎక్కువగా లేకున్నా.. టీమిండియాతో మరో 9 రోజుల్లో ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో విలియమ్సన్‌కు గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటని కివీస్‌ ఆలోచనలో పడింది. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో మొదలయ్యే రెండో టెస్టులో కేన్ ఆడతాడో లేడో స్పష్టమైన సమాచారం లేదు. బహుశా కివీస్ మేనేజ్మెంట్ మ్యాచ్ కు ముందు తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే కేన్‌కు అయిన గాయం చిన్నదే అని సమాచారం. ఎడమచేతి చూపుడు వేలిలో చీలిక రావడంతో స్టార్ స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌ ఇప్పటికే దూరమయ్యాడు. అయితే లెఫ్ట్ ఆర్మ్ సీనియర్ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం న్యూజిలాండ్‌కు సానుకూలాంశం. బౌల్ట్‌ కోసం మొదటి టెస్టు ఆడిన పేసర్లలో ఒకరికి విశ్రాంతినిస్తామని కివీస్ కోచ్‌ గ్యారీ స్టీడ్‌ తెలిపారు.

  "లార్డ్స్‌లో ఆడిన పేస్‌ బౌలర్లంతా రెండో టెస్టు ఆడరు. బౌల్ట్‌ అందుబాటులో ఉన్నాడు. జట్టులోకి పునరాగమనం చేస్తాడు. ఎడమచేతి చూపుడు వేలికి గాయమవ్వడంతో శాంట్నర్‌ దూరమయ్యాడు. విలియమ్సన్‌ గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం సాయంత్రం అతడు ఆడేదిలేనిది నిర్ణయం తీసుకుంటాం"అని స్టీడ్‌ చెప్పారు.


  బర్మింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 10 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత టీమిండియాతో న్యూజిలాండ్‌ ప్రతిష్ఠాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనుంది. జూన్‌ 18న సౌథాంప్టన్ వేదికగా ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ కీలక మ్యాచ్‌కు ముందు కేన్ విలియమ్సన్‌ గాయపడటం ఆ జట్టు ఇబ్బందికరమే. అతడు త్వరగా కోలుకోవాలని కివీస్‌ కోరుకుంటోంది. ఫైనల్లో గెలవాలంటే ఆ జట్టుకు కేన్‌ ఎంతో అవసరం. దీంతో ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం.. కేన్ మామకు రెండో టెస్టులో విశ్రాంతిని ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక, తొలి టెస్టులో కేన్‌ విలియమ్సన్‌ ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే పెవిలియన్ చేరగా.. రెండో ఇన్నింగ్స్‌లో సింగిల్‌ రన్‌కే అవుటయ్యాడు. అయితే కేన్‌ ఎపుడైనా ఫామ్ అందుకోగలడు. అంతర్జాతీయ కెరీర్‌లో కేన్ ఇప్పటివరకు 84 టెస్టుల్లో, 151 వన్డేల్లో, 67 టీ20 మ్యాచ్‌ల్లో కివీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
  Published by:Sridhar Reddy
  First published: