Hockey World Cup 2023 : హాకీ ప్రపంచకప్ (Hockey World Cup) 2023కి రంగం సిద్దమైంది. భారత్ (India) వేదికగా జనవరి 13 నుంచి 29 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. తొలి రోజు ఏకంగా మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. భారత్ కూడా తన తొలిపోరును శుక్రవారం ఆడనుంది. స్పెయిన్ తో జరిగే ఈ పోరులో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. గ్రూప్ ‘డి’ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. ప్రపంచకప్ లో భారత్ పాల్గొనడం ఇది 15వ సారి. ప్రతి ప్రపంచకప్ లోనూ భారత్ ఆడటం విశేషం.
ప్రపంచ కప్‌ను మనం వరుసగా రెండోసారి నిర్వహిస్తుండడంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగుతోంది. 48ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పోడియం ఫినిష్ చేయాలని పట్టుదలగా ఉన్న హర్మన్‌ప్రీత్‌సింగ్ సేన గ్రూప్ ‘డి’లో శుక్రవారం ఇక్కడి నూతన బిర్సా ముండా స్టేడియంలో జరిగే తొలి పోరులో పటిష్ట స్పెయిన్‌ను ఎదుర్కొంటోంది. 1971లో జరిగిన మొదటి వరల్డ్ కప్‌లో కాంస్యం అందుకున్న మన జట్టు..తదుపరి మరింత మెరుగైన ప్రదర్శనతో 1973 టోర్నీలో రజత పతకంతో భళా అనిపించింది.
ఇక అజిత్‌పాల్ సింగ్ సారథ్యంలో మనోళ్లు 1975లో విశ్వవిజేతలుగా నిలిచి హాకీ ఫ్యాన్స్ గర్వపడేలా చేశారు. ఆ తర్వాత భారత జట్టు ఎప్పుడూ మెగా టోర్నీలో కనీసం సెమీ్‌స కూడా చేరకపోవడం గమనార్హం. 1978 నుంచి 2014 వరకు గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది. అయితే.. టోక్యో ఒలింపిక్స్ లో మన జట్టు ప్రదర్శన వావ్ అన్పించింది. విశ్వ క్రీడల్లో కాంస్య పతకంతో మళ్లీ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించారు. ఇప్పుడు మరోసారి.. దుమ్మురేపాలని ప్రయత్నిస్తుంది హాకీ జట్టు.
ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలి..?
ఈ రోజు జరిగే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం స్టార్‌స్పోర్ట్స్‌లో చూడవచ్చు. ఇంకా హాట్ స్టార్ యాప్‌లో హాకీ వరల్డ్ కప్ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ చేయబడుతుంది.
పూల్‌ల వివరాలు
గ్రూప్ ‘ఎ’ – అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా
గ్రూప్ ‘బి’ – బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా
గ్రూప్ ‘సి’ – చిలీ, మలేసియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్
గ్రూప్ ‘డి’ – భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్
నేటి మ్యాచ్‌లు.. కాలమానం..
అర్జెంటీనా X దక్షిణాఫ్రికా (మ.గం. 1.00 నుంచి)
ఆస్ట్రేలియా X ఫ్రాన్స్ (మం.గం. 3.00 నుంచి)
ఇంగ్లండ్ X వేల్స్ (సా.గం. 5.00 నుంచి)
భారత్ X స్పెయిన్ (సా.గం. 7.00 నుంచి)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hockey, Hockey World Cup 2023, Odisha, Team India