Hockey World Cup 2023 : హాకీ ప్రపంచకప్ (Hockey World Cup) 2023 నరాలు తెగే ఉత్కంఠ పోరుకు వేదికైంది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్ లో ఇంగ్లండ్ (England)తో భారత్ (India) తలపడింది. ఇరు జట్లు కూడా హోరా హోరీగా తలపడ్డాయి. నిర్ణీత 60 నిమిషాల ఆటలో ఇరు జట్లు కూడా గోల్స్ చేయడంలో విఫలం అయ్యాయి. దాంతో మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. తమ ఆరంభ పోరుల్లో అటు ఇంగ్లండ్ (వేల్స్ పై) ఇటు భారత్ (స్పెయిన్)పై విజయాలు సాధించాయి. దాంతో ఇరు జట్ల ఖాతాలో చెరో నాలుగు పాయింట్లు చేరాయి. గోల్స్ డిఫరెన్స్ లో ముందంజలో ఉన్న ఇంగ్లండ్ గ్రూప్ ‘డి’లో ఆధిక్యంలో నిలిచింది.
ఆట ఆరంభం నుంచే ఇరు జట్లు బంతి నియంత్రణ కోసం తీవ్రంగా శ్రమించాయి. అయితే తొలి అర్ధ భాగంలో ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. బంతిని ఎక్కువ సేపు తమ నియంత్రణలో ఉంచుకుంటూ భారత్ పై ఒత్తిడి పెంచింది. తొలి అర్ధ భాగంలో ఇంగ్లండ్ కు ఏకంగా 6 పెనాల్టీ కార్నర్స్ లభించాయి. అయితే వీటిని భారత డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. దాంతో ఇంగ్లండ్ గోల్ చేయలేకపోయింది. అదే సమయంలో అడపాదడపా ఇంగ్లండ్ గోల్ పోస్ట్ పై దాడి చేసిన భారత్ కు ఒక పెనాల్టీ కార్నర్ మాత్రమే లభించింది. అయితే దానిని సద్వినియోగం చేసుకోవడంలో భారత్ సక్సెస్ కాలేదు.
ఇక రెండో అర్ధ భాగంలో భారత్ దూకుడు కనబర్చింది. పలు మార్లు గోల్ చేసే అవకాశాన్ని సృష్టించింది. అయితే ఇంగ్లండ్ డిఫెన్స్ దుర్బేధ్యంగా ఉండటంతో గోల్ చేయలేకపోయింది. ఇక చివరి నిమిషాల్లో ఇంగ్లండ్ మళ్లీ పుంజుకుంది. వరుస పెట్టి భారత గోల్ పోస్ట్ పై అటాక్ చేస్తూ టీమిండియాను ఇబ్బందికి గురి చేసింది.
ఆఖర్లో ట్విస్ట్
ఆట మరో 19 సెకన్లలో ముగస్తుందనగా.. ఇంగ్లండ్ కు పెనాల్టీ కార్నర్ లభించింది. దాంతో స్టేడియం మొత్తం నిశ్శబ్ధంగా మారిపోయింది. ఆఖరి నిమిషాల్లో ఒత్తిడిలోకి వెళ్లి ప్రత్యర్థులకు గోల్ ను సమర్పించుకుంటుందనే అపవాదు భారత్ కు ఉంది. దాంతో ఈ మ్యాచ్ లో కూడా భారత్ ప్రత్యర్థికి గోల్ ను సమర్పించుకుని ఓడుతందేమో అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇంగ్లండ్ ప్లేయర్ పెనాల్టీ కార్నర్ ను గురి చూసి భారత్ పోస్ట్ పైకి కొట్టాడు. అయితే గోల్ కీపర్ పాఠక్ దానిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. బంతి కాస్తా పాఠక్ చేతికి తగిలి గోల్ పోస్ట్ కు తాకుతూ దూరంగా వెళ్లిపోయింది. దాంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే గ్రూపులో జరిగిన మరో మ్యాచ్ లో స్పెయిన్ 5 - 1 గోల్స్ తేడాతో వేల్స్ పై ఘనవిజయ సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hockey, Hockey World Cup 2023, India, Team India