Hockey World Cup 2023 : హాకీ ప్రపంచకప్ (Hockey World Cup) 2023లో భారత (India) జట్టు శుభారంభం చేసింది. స్వదేశంలో జరుగుతున్న మెగా టోర్నీలో బోణీ కొట్టింది. గ్రూప్ ‘డి’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో భారత్ 2-0 గోల్స్ తేడాతో స్పెయిన్ పై జయభేరి మోగించింది. 60 నిమిషాల ఆటలో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత్ తరఫున అమిత్ రోహిదాస్ (12వ నిమిషంలో), హార్దిక్ సింగ్ (26వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. భారత గోల్ కీపర్ కృష్ణ పాఠక్ మూడు సార్లు ప్రత్యర్థిని గోల్ చేయనీయకుండా అడ్డుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన భారత ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. భారత తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 15న ఇంగ్లండ్ తో ఆడనుంది.
ఇది కూడా చదవండి : ఆ విషయంలో పాకిస్తాన్ కంటే వెనుకబడ్డ టీమిండియా.. ఎందులో అంటే?
ఆట ఆరంభం నుంచే భారత్ అదరగొట్టింది. బంతిని ఎక్కువ సేపు తన నియంత్రణలోనే ఉంచుకుంటూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. తొలి క్వార్టర్ లో లభించిన పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచిన రోహిదాస్ భారత్ గోల్స్ ఖాతా తెరిచేలా చేశాడు. ఇక రెండో క్వార్టర్ లో హార్దిక్ ఫీల్డ్ గోల్ తో భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. చివరి రెండు క్వార్టర్స్ లో గోల్స్ కోసం స్పెయిన్ చేసిన ప్రయత్నాలను భారత డిఫెన్స్ అడ్డుకుంది. ఇక గ్రూప్ ‘డి’లోనే జరిగిన మరో పోరులో ఇంగ్లండ్ 5-0 గోల్స్ తేడాతో వేల్స్ పై నెగ్గింది. ఇంగ్లండ్ తరఫున లియామ్ (27వ, 37వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేశాడు. పార్క్ నికోలస్ (1వ నిమిషంలో), రూపర్ ఫిల్ (41వ నిమిషంలో), నికోలస్ (57వ నిమిషంలో) తలా ఓ గోల్ చేశారు.
ఇక గ్రూప్ ‘ఎ’లో కూడా రెండు మ్యాచ్ లు జరిగాయి. తొలి మ్యాచ్ లో అర్జెంటీనా 1-0 గోల్ తేడాతో సౌతాఫ్రికాపై నెగ్గింది. అర్జెంటీనా తరఫున కసెల్లా (42వ నిమిషంలో) గోల్ చేసి తన జట్టును గెలిపించుకున్నాడు. అనంతరం ఇదే గ్రూపులో జరిగిన మరో మ్యాచ్ లో ఆస్ట్రేలియా 8-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ పై జయభేరి మోగించింది. ఆస్ట్రేలియా తరఫున జెరెమీ (26వ, 28వ, 38వ నిమిషాల్లో), క్రెయిగ్ టామ్ (8వ, 31వ, 44వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున చేసి హ్యాట్రిక్ సాధించారు. ఫ్లైయిన్ (26వ నిమిషంలో), టామ్ (53వ నిమిషంలో) చెరో గోల్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hockey World Cup 2023, Spain, Team India