క్రికెట్ మైదానంలో హిట్ మ్యాన్ గా ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. సంపాదనలో కూడా అదరగొడుతున్నాడు. ఏడాదికి సుమారు 130 కోట్లకు పైగా వెనకేసుకుంటున్నాడు ఈ టాప్ క్రికెటర్. ఈ సంపాదనలో ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారానే ఆర్జిస్తున్నాడు. రోహిత్ శర్మ టీమిండియా క్రికెటర్లలో కోహ్లీ తర్వాత అత్యంత పాపులర్. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. రోహిత్ శర్మకి బీసీసీఐ A+ కాంట్రాక్టు కేటాయించింది. రోహిత్ తో పాటు కోహ్లీ, బుమ్రా మాత్రమే ఈ కాంట్రాక్టులో ఉన్నారు. ఈ కాంట్రాక్టు ప్రకారం ఏడాదికి ఏడు కోట్లు రోహిత్ కు దక్కనున్నాయ్. ఇది కాకుండా మ్యాచ్ ఫీజు ద్వారా కూడా రోహిత్ బాగానే సంపాదిస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్ కు 15, వన్డేకి 6, టీ-20 మ్యాచ్ కు 3 లక్షల రూపాయలు ఫీజుల రూపంలో రోహిత్ ఖాతాలో పడతాయ్.
ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. అత్యంత ఆదరణ గల ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు హిట్ మ్యాన్. ముంబై ఇండియన్స్ యజమాన్యం రోహిత్ కు ఏడాదికి 15 కోట్ల రూపాయలను చెల్లిస్తోంది. ముంబై టీమ్ లో ఇదే అత్యధికం. ఇంకా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక రోజు ఆడినందుకు దాదాపు 35 వేల రూపాయలు వెనకేసుకుంటున్నాడు రోహిత్.
హిట్ మ్యాన్ సంపాదన ఎక్కువగా ఎండార్సింగ్ బ్రాండ్ల ద్వారానే ఆర్జిస్తున్నాడు. పేరు ప్రఖ్యాతులు గల అడ్వర్టైజ్మెంట్లకు రోహిత్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. సిట్ టైర్స్, నాయిస్, డ్రీమ్ -11, ట్రాక్సాస్ లాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా రోహిత్ పనిచేస్తున్నాడు. వీటి ద్వారా సుమారు 60 నుంచి 70 కోట్ల రూపాయల్ని ఆర్జిస్తున్నాడు. అదనంగా షూటింగ్ లో పాల్గొన్నందుకు రోజుకు కోటి రూపాయల దాకా ఛార్జ్ చేస్తాడు. ఇప్పుడున్న రోహిత్ దూకుడు చూస్తుంటే రానున్న రోజుల్లో మనోడు మరింతగా వెనకేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Published by:Sridhar Reddy
First published:January 06, 2021, 22:48 IST