Sushil Kumar: ఆరు రాష్ట్రాలు..19 రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్..సుశీల్ కుమార్ పోలీసులకు ఎలా చిక్కాడంటే..

సుశీల్ కుమార్

Sushil Kumar: 19 రోజుల పాటు కళ్లుగప్పి తిరిగిన సుశీల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అలాగే అతడితో పాటు తిరిగిన అజయ్​ కూడా కస్టడీలోకి వెళ్లాడు. అసలు సుశీల్ కుమార్ ఏం చేశాడు.. ఇన్ని రోజులు ఎక్కడెక్కడ తిరిగాడు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..

  • Share this:
రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన భారత ఏకైక అథ్లెట్​, స్టార్ రెజ్లర్​ సుశీల్ కుమార్..(Sushil Kumar) హత్య కేసు ఆరోపణలతో అరెస్టయ్యాడు. ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో మే 4న జరిగిన గొడవలో యువ రెజ్లర్​ సాగర్ రాణా మృతి చెందడంతో అతడి హత్యతో సుశీల్​కు సంబంధముందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా సుశీల్ తప్పించుకొని తిరిగాడు. దీంతో అతడిపై ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వివధ రాష్ట్రాల్లో గాలించారు. మొత్తంగా 19 రోజుల పాటు కళ్లుగప్పి తిరిగిన సుశీల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఢిల్లీలోని రోహిణి కోర్టు అతడికి ఆరు రోజుల కస్టడీ విధించింది. అలాగే అతడితో పాటు తిరిగిన అజయ్​ కూడా కస్టడీలోకి వెళ్లాడు. అసలు సుశీల్ కుమార్ ఏం చేశాడు.. ఇన్ని రోజులు ఎక్కడెక్కడ తిరిగాడు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..

మే 4వ తేదీన ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో రెండు గ్రూప్​ల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో 23ఏళ్ల యువ రెజ్లర్​ సాగర్ రాణా మృతి చెందగా సోనూ, అమిత్ కుమార్ అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే సుశీల్​ కుమార్​తో పాటు మరికొందరు రెజ్లర్లు తీవ్రంగా కొట్టడంతోనే రాణా మృతి చెందాడని ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా సుశీల్ తప్పించుకుతిరగడంతో అనుమానాలు బలపడ్డాయి. దీంతో ఢిల్లీ పోలీసులు సుశీల్​పై ఎఫ్​ఐఆర్ నమోదు చేసి.. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సుశీల్ ముందస్తు బెయిల్​ పిటిషన్​ను కోర్టు కొట్టేసింది. ఈ పరిణామాలతో సుశీల్ మకాం మారుస్తూ తప్పించుకొని తిరిగాడు.

పోలీసులకు చిక్కకుండా తిరిగేందుకు సుశీల్ ఆరు రాష్ట్రాల సరిహద్దుల్లో తిరిగినట్టు వార్తలు వస్తున్నాయి. రాణా మృతి చెందిన కాసేపటికే ఢిల్లీ దాటిన సుశీల్ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పటి చాలా చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. ఇక అతడు ఇతర రాష్టాల్లో తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్​, ఉత్తరాఖండ్​, హర్యానా, పంజాబ్​ల్లో క్రైమ్ బ్రాంచ్​తో పాటు ప్రత్యేక బృందాలు కూడా వెతికాయి. ఆ తర్వాత అతడి గురించి సమాచరమిస్తే రూ.50వేల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. చివరగా అతడిని పశ్చిమ ఢిల్లీలో పోలీసులు పట్టుకున్నారు.


‘సుశీల్ కుమార్​ గురించి మాకు ఆదివారం సమాచారం అందింది. ఓ ఫ్రెండ్ దగ్గరి నుంచి డబ్బు తీసుకునేందుకు సుశీల్​తోపాటు మరికొందరు పశ్చిమ ఢిల్లీకి వస్తున్నారని తెలిసింది. అప్పుడే ముంద్కాలోని ప్రత్యేక బృందం సుశీల్​ను పట్టుకుంది’ అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.అలాగే గ్యాంగ్​స్టర్​ కాలా జతేరీతో సుశీల్​కు సంబంధాలున్నాయన్న ఆరోపణలు రావడంతో ఈ విషయంపైనా ఆరా తీసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కాలా బంధువు సైతం ఛత్రాసాల్ గొడవలో గాయపడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా సుశీల్​పై ఢిల్లీ పోలీసులు హత్య, కిడ్నాప్​ సహా వివిధ క్రిమినల్​ అభియోగాల ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. మొత్తానికి ఇంత కాలం స్టార్ రెజ్లర్​గా ఎందరికో ఆదర్శంగా నిలిచిన సుశీల్ కుమార్ చేతులకు ప్రస్తుతం సంకెళ్లు పడ్డాయి.
Published by:Sridhar Reddy
First published: