వెస్టిండీస్ వేదికగా అండర్-19 వరల్డ్ కప్ (Under -19 World Cup) 2022 జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ (BCCI) ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అండర్-19 జట్టులో గుంటూరు జిల్లా (Guntur) వాసి చోటు దక్కించుకుని సంచలనం సృష్టించాడు. వచ్చే నెల నుండి జరిగే అండర్ -19 వరల్డ్ కప్ జట్టులో ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్ రషీద్ (Sheikh Rashid) వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ జట్టుకు కెప్టెన్ గా యశ్ ధుల్ వ్యవహరిస్తాడు. ఈ టోర్నీ 2022 జనవరి 14న ప్రారంభం కానుంది. 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. మంగళగిరిలో ప్రత్యేక కోచ్ ల ద్వారా శిక్షణ పొందుతున్నాడు. కుర్రాడి ఎంపిక పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మనోడికి జట్టులో చోటు లక్ మీదే ఏమీ దక్కలేదు. రషీద్ ట్రాక్ రికార్డే జట్టులో చోటు దక్కేలా చేసింది.
తన కెప్టెన్సీ స్కిల్స్, సూపర్ బ్యాటింగ్‌తో ఇప్పటికే జూనియర్ లెవర్ క్రికెట్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీతో పాటు ఇండియా అండర్-19 టీమ్ తరఫున సత్తా చాటిన అతను ఇప్పుడు అండర్-19 ఆసియా కప్‌తో పాటు వెస్టిండీస్ వేదికగా జరిగే ప్రపంచకప్ బరిలోకి దిగనున్నాడు. ఏడేళ్ల వయసులోనే బ్యాట్ పట్టిన ఈ ఆంధ్ర చిచ్చర పిడుగు అండర్-16కు వచ్చేసరికి ఆలిండియా టాపర్ కిరీటం అందుకున్నాడు. ఈ రెండేళ్లలో అతని మణికట్టు ఆట చూసి ముచ్చటపడని సీనియర్ క్రికెటర్ లేడంటే అతిశయోక్తి కాదు.
రషీద్ తండ్రి బలీషా వలీ లోన్ రికవరీ ఏజెంట్‌గా పనిచేసే చిరుద్యోగి. వలీ సంపాదన అంతంత మాత్రమే అయినా కొడుకు ఆసక్తిని గమనించి అతడికి ఏడేళ్ల వయసునుంచే క్రికెట్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. తొమ్మిదో ఏటనే అండర్-14 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రషీద్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అంతర్ జిల్లాల పోటీల్లో భాగంగా శ్రీకాకుళంపై పన్నెండేళ్ల వయస్సులోనే ట్రిపుల్ సెంచరీ కొట్టిన రషీద్‌ను స్థానికులు చిచ్చర పిడుగుగా పిలుస్తుంటారు.
కోచ్ కృష్ణారావు దగ్గర క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న ఈ కుర్రాడు ప్రస్తుతం ఆంధ్ర అండర్-19 టీమ్ చీఫ్ కోచ్ జ్ఞానేశ్వరరావు దగ్గర రాటు దేలాడు. బంతిని అంచనా వేయడంలో, షాట్ల ఎంపికలో అద్భుతమైన నైపుణ్యం దొరకబుచ్చుకున్న రషీద్ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే కనీసం హాఫ్ సెంచరీ బాదకుండా పెవిలియన్ చేరడు. విరాట్ కోహ్లీని అమితంగా ఆరాధించే రషీద్‌కు అతని పోరాట పటిమంటే చాలా ఇష్టం. సీనియర్లు శ్రీకర్ భరత్, కేవీ శశికాంత్‌తో సన్నిహితంగా ఉండే రషీద్ అవసరమైనప్పుడు వారి సలహాలు తీసుకుంటుంటాడు.
ఇది కూడా చదవండి : చిక్కుల్లో పాక్ లెగ్ స్పిన్నర్.. మైనర్ పై అత్యాచారం కేసులో బుక్కైన యాసిర్ షా..!
2017లో అండర్-16 కేటగిరీలో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే హయ్యెస్ట్ రన్నర్‌గా రషీద్ నిలిచాడు. తర్వాతి ఏడాది అండర్-19లో 680 రన్స్‌తో జాతీయ స్థాయిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
తద్వారా తన సత్తా ఏంటో సెలెక్టర్లకు తెలియజేశాడు. ఐదేళ్లుగా ఆంధ్ర అండర్-14,16,19 జట్లకు నాయకత్వం వహిస్తున్న రషీద్.. ఈ ఏడాది నవంబరు 28 నుంచి డిసెంబరు 7 వరకు జరిగిన అండర్-19 బంగ్లాదేశ్, ఇండియా-ఎ, ఇండియా-బి ట్రై సిరీస్ లో ‘ఎ' జట్టుకు సారథ్యం వహించాడు.
ఈ ఏడాది వినూ మన్కడ్‌లో ఆరు మ్యాచ్‌లాడిన రషీద్ రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలతో 400కు పైగా పరుగులు చేసి దుమ్మురేపాడు. చాలెంజర్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన ఈ మణికట్టు స్ట్రోక్ ప్లేయర్ ఒక అజేయ సెంచరీ సహా 275 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.