బతుకు తెరువు కోసం టీ అమ్ముతున్న ఏషియాడ్ పతక విజేత!

క్రీడాకారులకు నామమాత్రపు ప్రోత్సాహకం అందించిన కేంద్రం... కుటుంబ పోషణ కోసం టీ కొట్టులో పనిచేస్తున్న సెపక్ తక్రా క్రీడాకారుడు హరీశ్ కుమార్!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 7, 2018, 2:35 PM IST
బతుకు తెరువు కోసం టీ అమ్ముతున్న ఏషియాడ్ పతక విజేత!
టీ అమ్ముతున్న ఏషియాడ్ పతక విజేత హరీశ్ కుమార్!
  • Share this:
ఏషియాడ్ 2018లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఏకంగా 69 పతకాలు సాధించి, ఆసియా క్రీడా సంగ్రామంలోనే అత్యధిక పతకాలు సాధించిన టీంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. దీంతో వచ్చే ఒలింపిక్ క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడతారనే ఆశలు క్రీడాభిమానుల్లో చిగురించాయి. ఒలింపిక్స్ ఈవెంట్‌లో ఇన్నాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమైన భారత్, ఈసారి డబుల్ డిజిట్ చేరుకోవడం పక్కా... అంటూ గణాంకాలు వేయడం మొదలెట్టారు. అయితే అసలు పరిస్థితి వేరేలా ఉంది. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి ఒకరిద్దరు తప్ప, మిగిలిన రాష్ట్రాల్లో ఏషియాడ్ పతక విజేతలకు సరైన గుర్తింపు లభించడం లేదు. ఇందుకు నిదర్శనమే సెపక్ తక్రా ఈవెంట్‌లో కాంస్య పతకం గెలిచిన టీంలో సభ్యుడైన హరీశ్ కుమార్ పరిస్థితి.

ఏషియాడ్ 2018లో పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ ప్రోత్సాహకాలు ప్రకటించింది కేంద్రం. స్వర్ణం సాధించిన వారికీ 30 లక్షల రూపాయలు, రజతం సాధించిన వారికి 20 లక్షలు, కాంస్య పతకం గెలిచిన వారికి 10 లక్షల రూపాయల ఆర్థిక ప్రోత్సహం అందించారు. ఈ మొత్తం క్రీడాకారులకు ఎందుకు పనికి రాదు. క్రికెటర్లకు, టెన్నిస్, బ్యాడ్మింటన్ ప్లేయర్లకు స్పానర్లు ఉంటారు. యాడ్స్ ఉంటాయి. మ్యాచ్‌లు గెలిచినా, గెలవకపోయినా, ఆడినా, ఆడకపోయినా విలాసవంతమైన జీవితం గడిపేందుకు కావల్సినంత నేమ్, ఫేమ్, అదృష్టం ఉంటాయి. కానీ మిగిలిన క్రీడాకారుల పరిస్థితి అలా కాదు. గోల్డ్ మెడల్ గెలిచిన స్వప్నా బర్మన్ వంటి అథ్లెట్స్ కూడా కఠిక దారిద్రం నుంచి వచ్చిన వాళ్లే. ఇలాంటి వారికి నామమాత్రంగా ప్రోత్సాహకం అందించి, చేతులు దులుపుకుంది కేంద్రం.

ఏషియాడ్ ఈవెంట్‌లో పతకాలు సాధించి, దేశం గర్వించేలా చేసిన చాలామంది క్రీడాకారులు బతకు తెరువు కోసం రోజూ కష్టపడుతూనే ఉన్నారు. సెపక్ తక్రా టీం ఈవెంట్‌లో కాంస్య పతకం గెలిచిన హరీశ్ కుమార్‌ది ఇలాంటి దీనమైన కథే. ఆర్థికంగా కుటుంబానికి ఆసరా ఉండేందుకు హరీశ్ కుమార్ ఓ టీ కొట్టు నడుపుకుంటున్నాడు. అంతర్జాతీయ వేదికపై భారత జాతీయ పతకాన్ని సగర్వంగా రెపరెపలాడించిన క్రీడాకారుడు, బతకు తెరువు కోసం టీ అమ్ముకుంటున్నాడు.


మా కుటుంబం చాలా పెద్దది. మేం సంపాదించేది రోజూ తినడానికే సరిపోదు. అందుకే నా కుటుంబానికి సాయపడడం కోసం నాన్నగారి టీ కొట్టులో పని చేస్తుంటాను. అయితే మధ్యాహ్నం 2 నుంచి 6 దాకా ప్రాక్టీస్‌‌కే కేటాయించాను. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించి, నా కుటుంబానికి ఆసరాగా నిలవాలనేదే నా లక్ష్యం.
హరీశ్ కుమార్, సెపక్ తక్రా ప్లేయర్ (ఏషియాడ్ 2018 కాంస్య పతక విజేత)


ఏషియాడ్ 2018 సెపక్ తక్రా టీంలో సభ్యుడైన హరీశ్ కుమార్ ఎన్నో కష్టాలను అధిగమించి, ఆ స్థాయికి చేరుకున్నాడు. 2011 నుంచి సెపక్ తక్రా ఆడుతున్న హరీశ్... తన క్రీడా ప్రస్థానం గురించి కూడా వివరించాడు. ‘‘చిన్నప్పుడు నేను టైర్‌తో ఆడుకుంటుంటే కోచ్ హేమ్‌రాజ్ చూసి, సెపక్ తక్రా ఆటను నేర్పించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత నెలనెలా నాకు అవసరమైన ఫండ్స్, కిట్స్ వచ్చేవి. రోజూ ప్రాక్టీస్ చేస్తునే ఉంటాను...’ అన్నాడు హరీశ్. హరీశ్ వాళ్ల తండ్రి ఓ ఆటో డ్రైవర్. తల్లి ఓ చిన్న టీ కొట్టు నడుపుతుంటోంది. ఇందులో హరీశ్‌ పనిచేస్తూ, తల్లిదండ్రులకు సాయం చేస్తుంటాడు. తాము ఇంటి అద్దె కట్టేందుకు కూడా కష్టపడిన రోజులున్నాయని చెప్పిన హరీశ్ కుమార్ తల్లి, తన కొడుక్కి ఓ ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.
First published: September 7, 2018, 2:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading