IPL 2021 : హార్దిక్ కుటుంబం గొప్ప మనసు.. అమ్మ చెప్పిందని ఏం చేశారంటే..

కరోనా రోగుల సహాయార్దం పాండ్యా కుటుంబం.. 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల విరాళం

  • Share this:
    'మన దేశం ఇప్పుడు ఒక గొప్ప యుద్దం చేస్తున్నది. కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సమయంలో మా కుటుంబం తరపున కూడా ఏమైనా చేయాలని అనుకున్నాము. మా అమ్మను అడిగాం.. అమ్మా మనం ఏం చేద్దాం ఈ పరిస్థితుల్లో అని.. మన తోటి ప్రజలకు ఇలాంటి కష్టకాలంలో ఎలాంటి సహాయం అయినా చేయాలి.. ముందు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందిద్దాం అని కుటుంబం మొత్తం నిర్ణయించుకున్నాము' అని ఒక హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)  తరపున ఐపీఎల్ (IPL 2021) ఆడుతున్న ఈ ఆల్‌రౌండర్ కరోనాపై పోరాటంలో తన వంతు సాయం అందించాలని అనుకున్నాడు. తన అన్న కృనాల్ పాండ్యాతో పాటు కుటుంబం మొత్తం కలసి ఈ సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండటంతో దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు ముందుగా 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందించాలని పాండ్యా ఫ్యామిలీ నిర్ణయించింది. ఈ సహాయం ఇక్కడితో ఆగిపోదని.. రానున్న రోజుల్లో మరింత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కరోనాపై పోరాటంలో ఇండియాలోని ప్రతీ ఒక్కరితో నడుస్తామని వారు చెప్పారు.

    గత ఏడాది కాలంగా కరోనా పోరాటంలో ముందున్న ప్రతీ ఫ్రంట్ లైన్ వారియర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తిగతంగా సాయం చేసిన ప్రతీ ఒక్కరు కలసి కట్టుగా ఉండి ఈ కష్ట కాలంలో ఎంతో సేవ చేశారని కొనియాడాడు. తమ రోజువారీ ప్రార్థనల్లో తప్పకుండా గుర్తు చేసుకుంటున్నామని పాండ్యా చెప్పాడు. దయచేసి ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని.. మాస్క్ ధరించడం మాత్రం మర్చిపోవద్దని అన్నాడు. అందరూ భౌతిక దూరాన్ని పాటించి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని పాండ్యా కోరాడు.





    ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఆడుతున్నారు. ఈ సీజన్‌లో కృనాల్ అడపాదడపా మెరుపులు మెరిపించినా.. హార్దిక్ పాండ్యా మాత్రం ఇంకా తన సహజ శైలిలో ఆటను ఆడలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కిరాన్ పొలార్డ్‌కు తోడుగా కాసేపు ఆడి విజయంలో చిన్న పాత్రను పోషించాడు. అయితే గత కొంత కాలంగా బౌలింగ్‌కు మాత్రం దూరంగా ఉంటున్నాడు. ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న హార్దిక్ కేవలం బ్యాటింగ్‌కే పరిమితం అవడం ఆందోళన కలిగిస్తున్నది. గతంలో అతడు వెన్నునొప్పికి సంబంధించి సర్జరీ చేయించుకున్నాడు. దాన్నుంచి ఇంకా పూర్తిగా కలుకోకపోవడంతోనే బౌలింగ్ వేయట్లేదని తెలుస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published: