Team India: ఫస్ట్ టెస్టులో టీమ్ ఇండియాకు కష్టాలు తప్పవా? ట్రెంట్‌బ్రిడ్జ్‌లో కష్టాలు తప్పవా?

తొలి టెస్టులో టీమ్ ఇండియాకు కఠిన పరీక్ష (BCCI)

డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు సిరీస్‌లో భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. అగస్టు 4 నుంచి 8 వరకు నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్నది.

 • Share this:
  ఇండియా-ఇంగ్లాండ్ జట్ల (INDvENG) మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (Test Series) అగస్టు 4 (బుధవారం) నుంచి నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానున్నది. న్యూజీలాండ్ జట్టుతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడిన నెలన్నర తర్వాత భారత జట్టు (Team India) తిరిగి టెస్టు మ్యాచ్ ఆడుతున్నది. మధ్యలో జులై 20 నుంచి 22 వరకు చెస్టర్ లీ స్ట్రీట్‌లో కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్‌తో మూడు రోజుల మ్యాచ్ ఆడింది. అయితే ఆ సమయంలో ఇద్దరు భారత క్రికెటర్లు గాయపడటం.. టీమ్ ఇండియాలో కోవిడ్ కలకలం రేగడంతో తర్వాత జరగాల్సిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు చేశారు. కోవిడ్ బారిన పడిన రిషబ్ పంత్ కోలుకొని తిరిగి జట్టుతో జాయిన్ అయ్యాడు. భారత జట్టు ఇంకా దుర్హామ్‌లోనే ప్రాక్టీస్ చేసింది. భారత జట్టు తొలి టెస్టు మ్యాచ్ వేదిక అయిన ట్రెంట్‌బ్రిడ్జ్‌కు చేరుకున్నది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఇటీవల స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టును 3-1 తేడాతో ఓడించింది. అంతకు ముందు బారత జట్టు అందరి అంచనాలను వమ్ము చూస్తే ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను రెండో సారి ఓడించి చరిత్ర సృష్టించింది. మంచి ఫామ్‌లో ఉన్న టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా గెలుస్తుందని భావించినా.. వర్షం కారణంగా పలు ఆటంకాల నడుమ భారత్ జట్టు చేతులు ఎత్తేసింది.

  తొలి టెస్టు వేదిక అయిన ట్రెంట్‌బ్రిడ్జ్ పిచ్‌ను బీసీసీఐ ట్విట్టర్‌లో షేర్ చేసింది. పూర్తిగా పచ్చికతో కనపడుతున్న ఈ పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉన్నది. డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగిన సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ పిచ్‌లాగే కనపడుతున్నది. అదే జరిగితే భారత బ్యాట్స్‌మాన్‌కు కష్టాలు తప్పేలా లేవు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయంతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. దీంతో రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్ లేదా మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉన్నది. బ్యాకప్ కోసం పృథ్వీషాను బీసీసీఐ పంపుతామని చెప్పింది. కానీ షా, సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఇంగ్లాండ్‌లో జట్టుతో చేరలేదు. భారత టాపార్డర్ తప్పకుండా ఇంగ్లాండ్ పేసర్లను ధీటుగా ఎదుర్కోకపోతే డబ్ల్యూటీసీ ఫైనల్ ఫలితమే పునరావృతం అవుతుంది విశ్లేషకులు భావిస్తున్నారు. డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే కావడం గమనార్హం.

  భారత జట్టు ఈ సారి ఒకే స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉన్నది. తుది జట్టులో మహ్మద్ షమీ, బుమ్రా ఆడటం ఖాయమే. అయితే ఇషాంత్ శర్మ లేదా సిరాజ్ లలో ఒకరికి స్థానం దక్కే అవకాం ఉన్నది.  భారత జట్టు: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్దిమాన్ సాహ (కీపర్), పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్
  Published by:John Naveen Kora
  First published: