GOOD NEWS TO DOMESTIC CRICKETERS BCCI INCREASED MATCH FEE FOR DOMESTIC MATCHES JAY SHAH ANNOUNCED IN TWITTER JNK
BCCI: క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. వారికి ఇకపై భారీగా జీతాలు.. పాత డిమాండ్లకు ఓకే
క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ (PC: BCCI)
BCCI: బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశవాళీ క్రికెటర్ల వేతనాలను భారీగా పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. దుబాయ్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) అపెక్స్ కౌన్సిల్ సమావేశం దుబాయ్ వేదికగా జరుగుతున్నది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో క్రికెటర్ల నుంచి వచ్చిన అనేక పాత డిమాండ్లకు పచ్చ జెండా ఊపారు. దేశవాళీ క్రికెటర్లకు (Domestic Cricketers) ఇప్పటి వరకు ఇస్తున్న మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ (Apex Council) నిర్ణయం తీసుకున్నది. మూడు కేటగిరీలుగా వీరి వేతనాలు పెరుగనున్నాయి. దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సీనియర్లు (కనీసం 40 మ్యాచ్‌లు ఆడిన అనుభవం) ఇకపై ప్రతీ మ్యాచ్‌కు రూ. 60 వేల వేతనం పొందనున్నారు. అండర్ 23 కేటగిరీ క్రికెటర్లు రూ. 25 వేలు, అండర్ 19 కేటగిరీ క్రికెటర్లు రూ. 20 వేల మ్యాచ్ ఫీజుగా పొందనున్నారు. రంజీ ట్రోఫి (Ranji Trophy), దులీప్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడే పురుష క్రికెటర్లతో పాటు మహిళలకు కూడా కొత్త మ్యాచ్ ఫీజులు వర్తించనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా (Jay Shah) ట్విట్టర్లో ప్రకటించారు.
కోవిడ్ కారణంగా 2020-21 సీజన్ దేశవాళీ క్రికెట్‌ను పూర్తిగా రద్దు చేశారు. దీంతో కేవలం క్రికెట్ పైనే ఆధారపడిన అనేక మంది ప్రొఫెషనల్ క్రికెటర్లు ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది క్రికెటర్లు ఇతర పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకున్నారు. జార్ఖండ్, బెంగాళ్, యూపీకి చెందిన క్రికెటర్లు పనులు కూడా దొరకక ఇబ్బంది పడ్డారు. మరి కొంత మంది ఇంగ్లాండ్ కౌంటీ ఆడటానికి వెళ్లారు. తమకు రద్దైన సీజన్‌కు సంబంధించిన పరిహారం ఇప్పించాలని బీసీసీఐని కోరారు. సౌరవ్ గంగూలీ అధ్యక్షతన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో దేశవాళీ క్రికెటర్లు అందరికీ పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. 2019-20 సీజన్ ఆడిన క్రికెటర్లకు.. తర్వాతి సీజన్‌కు సంబంధించి 50 శాతం మ్యాచ్ ఫీజు పరిహారంగా అందించడానికి బీసీసీఐ నిర్ణయించింది. 2019-20 సీజన్లో దేశవాళీ క్రికెటర్లు ఎంత మ్యాచ్ ఫీజు డ్రా చేశారో.. దానిలో సగం పరిహారంగా లభించనున్నది.
Cricketers who participated in 2019-20 Domestic Season will get 50 per cent additional match fee as compensation for season 2020-21 lost due to COVID-19 situation #BCCIApexCouncil
కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఐపీఎల్ 2021 రెండో దశను యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్ సహా ఇతర బోర్డు పెద్దలందరూ హాజరయ్యారు. సోమవారం దుబాయ్‌లోనే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇందులో దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులపై నిర్ణయం తీసుకోవడంతో పాటు టీ20 వరల్డ్ కప్ నిర్వహణ, రాబోయే సీజన్లో టీమ్ ఇండియా ఆడబోయే ద్వైపాక్షిక సిరీస్‌లపై నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధింన పూర్తి వివరాలు సాయంత్రలోగా బీసీసీఐ వెల్లడించనున్నది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.