GOOD NEW FOR SUNRISERS HYDERABAD FANS AUSTRALIA AND ENGLAND PLAYERS WILL BE AVAILABLE FOR SECOND PHASE OF IPL SAYS BCCI JNK
Good News for SRH Fans: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఆ దేశ క్రికెటర్లు వస్తున్నట్లు చెప్పిన బీసీసీఐ
సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు శుభవార్త చెప్పిన బీసీసీఐ (PC: IPLT20)
ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభం కావడానికి సమయం దగ్గర పడుతుండటంతో బీసీసీఐ ఒక్కో అవాంతరాన్ని సరి చేసుకుంటూ వస్తున్నది. తాజాగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెండో దశకు వస్తున్నట్లు ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది.
ఐపీఎల్ 2021 (IPL 2021) రెండవ ఫేజ్ (Second Phase) సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ (UAE) వేదికగా ప్రారంభం కానున్నది. కరోనా కారణంగా ఇండియాలో జరిగిన తొలి దశ 29 మ్యాచ్‌ల తర్వాత వాయిదా పడిన సంగతి తెలసిందే. అనేక ఆటంకాలను తొలగించుకొని రెండవ దశను యూఏఈ నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ధోనీ (MS Dhoni) నేతృత్వంలోని సీఎస్కే (CSK) టీమ్ అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో కలసి యూఏఈ చేరుకున్నది. ముంబై ఇండియన్స్ జట్టు కూడా కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండానే యూఏఈలో అడుగు పెట్టింది. అయితే యూఏఈలో నిర్వహించనున్న ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌కు మొదటి నుంచి విదేశీ ప్లేయర్లు వస్తారా రారా అనే సందిగ్దత నెలకొన్నది. అయితే బీసీసీఐ అనూహ్యంగా టీ20 వరల్డ్ కప్ కూడా యూఏఈలోనే నిర్వహించేలా పావులు కదపడంతో ఇతర దేశాల క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్లను ఐపీఎల్‌కు పంపక తప్పని పరిస్థితులను సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ కూడా యూఏఈలోనే జరుగుతుండటంతో ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ మంచి మ్యాచ్ ప్రాక్టీస్ అవుతుందని భావించి విదేశీ పర్యటనలు కూడా పక్కన పెట్టి ఐపీఎల్‌కు పంపడానికి అంగీకరించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్లేయర్లు రెండో దశ లీగ్‌కు అందుబాటులో ఉంటారు. ఈ మేరకు ఐపీఎల్ సీవోవో హేమంగ్ అమిన్ (Hemang Amin) అన్ని ఫ్రాంచైజీలకు కాల్ చేసి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్లేయర్లు వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు.
'ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఐపీఎల్ 2వ దశలో పాల్గొనడానికి అనుమతి లభించినట్లు మాకు సమాచారం అందింది. ఇక మేము మా టీమ్ మేనేజర్ ద్వారా ఆటగాళ్లకు కాల్ చేయించి అందుబాటులో ఉంటాము' అని పంజాబ్ కింగ్స్ సీఈవో తెలిపారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో కూడా ఐపీఎల్‌కు రానున్నారు. ఇప్పటికే సన్ రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్నది. పూర్తిగా విదేశీ ప్లేయర్లపై ఆధారపడిన ఈ జట్టులో కీలక ప్లేయర్లు రాకపోతే ప్లేఆఫ్స్ ఛాన్స్ కూడా దక్కదు. దీంతో యాజమాన్యంతో పాటు ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందారు. అయితే తాజా సమాచారం మేరకు అందరు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని బీసీసీఐ శుభవార్త చెప్పింది. కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, జేసన్ హోల్డర్, జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో రెండో దశ కోసం యూఏఈ రానున్నారు.
ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా అందుబాటులోకి రానున్నాడు. ఇంగ్లాండ్ ప్లేయర్లు రావడంపై ఉన్న సందిగ్దత తొలిగిపోవడంతో.. కేకేఆర్ జట్టు ఊపిరి పీల్చుకున్నది. అతడు అందుబాటులోకి రావడంతో కొత్త కెప్టెన్‌ను నియమించే పని లేకుండా పోయింది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టులోని జోఫ్రా ఆర్చర్, జాస్ బట్లర్ మాత్రం గాయాల కారణంగా లీగ్‌కు దూరంగా ఉండనున్నారు. సీఎస్కే జట్టులోని జాసన్ బెర్హండాఫ్, సామ్ కర్రన్, మొయిన్ అలీ జట్టుతో చేరడం ఖాయమే. కాగా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇండియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా బయోబబుల్ టూ బయోబబుల్ ట్రాన్స్ఫర్ కానున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు ముందుగానే యూఏఈ చేరుకుంటారు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.