IPL 2021 : మమ్మల్ని ఇండియా జట్టుతో పంపించేయండి.. ఇక్కడ ఉండలేమంటున్న మ్యాక్స్‌వెల్

ఇంగ్లాండ్ వరకు కాస్త ఫైట్‌లో లిఫ్ట్ ఇవ్వండి : మ్యాక్సీ

 • Share this:
  ఐపీఎల్ 2021పై (IPL 2021) కరోనా సెకెండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ఇండియాలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు చూసి పలువురు ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోయారు. అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు కూడా భయంతో ఇంటి బాట పట్టారు. వరుసగా అందరూ వెళ్లిపోతుండటంతో ఈ సారి ఐపీఎల్ సక్రమంగా జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే కొంత మంది క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ ముగిసే వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. పాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాథన్ కౌల్టర్-నైట్ తమ జట్లతో పాటే ఉంటామని స్పష్టం చేశారు. అయితే ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులు, విమానాలపై మే 15 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ఆ తర్వాతైనా ఆ నిషేధం ఎత్తేస్తారో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా (Team India) వెళ్లే చార్టెడ్ ఫ్లైట్‌లో (Charter Flight) తమను కూడా పంపించేయాలని కోరాడు.

  జూన్ 18 నుంచి 22 వరకు ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా ఇండియా, న్యూజీలాండ్ జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ జరుగనున్నది. న్యూజీలాండ్ జట్టులోని సభ్యులు కొంత మంది ఐపీఎల్ ఆడుతున్నారు. వాళ్లు నేరుగా ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్లడానికి వారి క్రికెట్ బోర్డు అనుమతి ఇచ్చింది. అలాగే టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లాండ్‌లో సుదీర్ఘ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నది. వీరి కోసం బీసీసీఐ ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఆ ఫ్లైట్‌లోనే తమను ఇంగ్లాండ్ పంపాలని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోరుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బయోబబుల్ నుంచి బయటకు వచ్చి ఇండియాలో గడపలేమని.. యూకే పంపిస్తే అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటమాని మ్యాక్సీ అంటున్నాడు.

  ప్రస్తుత ఐపీఎల్ 2021లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న మ్యాక్సీ పలు మ్యాచ్‌లలో అదరగొట్టాడు. అయితే అతడి సత్తాకు తగిన ఇన్నింగ్స్ ఇంకా ఈ సీజన్‌లో రాలేదు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన మ్యాక్స్‌వెల్ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో ఆ జట్టు అతడిని విడుదల చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా మ్యాక్సీని ఆర్సీబీ జట్టు భారీ ధరకు వేలంలో కొనుగోలు చేసింది. కింగ్ కోహ్లీతోకలసి ఆడటం తన కల అని.. ఈ సీజన్‌లో తప్పకుండా రాణిస్తానని చెప్పాడు. ప్రస్తుతం ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకొని పోతున్నది. పడిక్కల్, కోహ్లీ, ఏబీ డివిలియర్స్ రాణిస్తున్నా.. మ్యాక్సీ బ్యాట్ నుంచి మాత్రం ఇంకా భారీ ఇన్నింగ్స్ రాలేదు.
  Published by:John Naveen Kora
  First published: