వాళ్లంతా కలిసినా రాయుడుకు సరిపోరు... గంభీర్ సంచలన వ్యాఖ్యలు

అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై స్పందించిన గౌతమ్ గంభీర్... ఇందుకు కారణమైన సెలక్టర్ల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

news18-telugu
Updated: July 3, 2019, 6:23 PM IST
వాళ్లంతా కలిసినా రాయుడుకు సరిపోరు... గంభీర్ సంచలన వ్యాఖ్యలు
గౌతమ్ గంభీర్(ఫైల్ ఫోటో)
  • Share this:
వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం రాకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. రాయుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వారిపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది భారత క్రికెట్ లోకానికి బాధాకరమైన సందర్భమని గంభీర్ వ్యాఖ్యానించారు. జాతీయ జట్టు, ఐపీఎల్‌లోనూ అంబటి రాయుడు బాగా రాణించారని గుర్తు చేశారు. అలాంటి ఓ అటగాడు రిటైర్ కావాలని నిర్ణయం తీసుకోవడానికి కారణమైన వారి పట్ల పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు గంభీర్.

సెలక్షన్ ప్యానెల్‌లోని మొత్తం ఐదుగురు సభ్యులు కలిసినా దేశం కోసం రాయుడు చేసిన స్కోర్‌ను సమం చేయలేరని గంభీర్ ధ్వజమెత్తారు. వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోవడం వల్ల అంబటి రాయుడు స్థానంలో ఎవరున్నా ఇదే స్థాయిలో బాధపడతారని గంభీర్ పేర్కొన్నారు. ఈ విషయంలో సెలక్టర్ల నిర్ణయం తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు 33 ఏళ్ల రాయుడు 2019 వరల్డ్ కప్ జాబితాలో ఉన్నప్పటికీ... ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కారణంగా తుదిజట్టులో స్థానం కోల్పోయాడు. విజయ్ శంకర్ బొటనవేలు గాయం కారణంగా టోర్నమెంటు నుంచి బయటికొచ్చేసినా... ఆ స్థానంలో తనకు బదులుగా మయాంక్ అగర్వాల్‌ను తీసుకోవడంతో తీవ్రంగా నిరాశ చెందిన రాయుడు... అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.


First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు