ఎన్నో జ్ఞాపకాలతో ఓ ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. సరికొత్త ఆశలతో 2022 ఏడాది వచ్చేసింది. ఈ కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు క్రికెట్(Cricket) ఎప్పటిలాగే సిద్ధమైంది. 2022లో టీమిండియా (Team India) తీరిక లేని క్రికెట్ ఆడనుంది. ఇక ఆ మజాలో మునిగిపోతూ.. ఆటను ఆస్వాదించడమే అభిమానుల పని. గతేడాది మిశ్రమ ఫలితాలతో ముందుకు సాగిన ఇండియన్ క్రికెట్ కు ఈ ఏడాది కీలకమనే చెప్పాలి. మేజర్ ఈవెంట్స్ ఈ ఏడాది జరగనుండటంతో ఫ్యాన్స్ కు బోలెడంత మజా రావడం ఖాయం. అయితే, ఈ ఏడాదిలో నాలుగు ఈవెంట్స్ లో టీమిండియా జయభేరి మోగిస్తే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కు అంతకన్నా మించిన సంతోషం మరొకటి ఉండదు. ఆ నాలుగు ఏంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
1. మహిళల వన్డే ప్రపంచకప్ :
టీమిండియా మెన్స్ జట్టులానే.. మహిళల టీమ్ కూడా మెగా ఈవెంట్లలో ఆఖరి మెట్టుపై బోల్తా పడుతున్న సంగతి తెలిసిందే. గత టీ-20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ లే ఇందుకు నిదర్శనం. టీమిండియా వుమెన్స్ టీమ్ ఇంతవరకు ఐసీసీ వరల్డ్ కప్ లు నెగ్గలేదు. అయితే, ఈ లోటును భర్తీ చేయడానికి మిథాలీ సేనకు ఈ ఏడాదే సువర్ణావకాశం. ఎందుకంటే.. ఈ ఏడాది న్యూజిలాండ్ లో మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది.
మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. వన్డే వరల్డ్ కప్ లో రెండు సార్లు ఫైనల్ చేరుకున్నా.. కప్ ను కొట్టడంలో మాత్రం టీమిండియా విఫలమైంది. ఇక, మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి సీనియర్లకు ఇదే లాస్ట్ ఛాన్స్. యంగ్ ప్లేయర్లతో ఇప్పుడు మహిళల టీమ్ స్ట్రాంగ్ గా ఉంది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ వంటి స్టార్ హిట్టర్లు టీమిండియా సొంతం. అలాగే, మిడిలార్డర్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉండటం కలిసొచ్చే అంశం. దీంతో, ఈ ఏడాది టీమిండియా వన్డే వరల్డ్ కప్ నెగ్గుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
2. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ల్లో టెస్ట్ సిరీస్ విజయాలు :
2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓడినా టీమిండియా టెస్టుల్లో మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ , సౌతాఫ్రికా పర్యటనల్లో కోహ్లీసేన అదరగొట్టి టెస్టుల్లో నెంబర్ వన్ గా నిలిచింది. 2016 నుంచి 2021 వరకు ప్రతి ఏడాది టీమిండియానే వరల్డ్ నెం.1 గా ఆ సంవత్సరాల్ని ముగించింది. ఇక, గతేడాది సూపర్ షోనే మరోసారి టీమిండియా రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఫస్ట్ సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ నెగ్గాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది జూలై లో జరిగే ఇంగ్లండ్ తో టెస్ట్ గెలిచి.. సిరీస్ కైవసం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పటౌడీ ట్రోఫీలో భాగంగా గతేడాది టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. సిరీస్ డిసైడర్ చేసే ఐదో టెస్ట్ కు ముందు టీమిండియాలో కరోనా కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీంతో.. ఐదో టెస్ట్ ను ఈ ఏడాది జూలైలో నిర్వహించనున్నారు. ఈ రెండు టెస్ట్ సిరీస్ ల్లో విజయం దక్కితే.. కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ల్లో టెస్ట్ సిరీస్ నెగ్గిన కెప్టెన్ గా నిలవనున్నాడు కోహ్లీ.
3. కొత్త ఏడాదిలో కావాలి.. పాత కోహ్లీ :
నిస్సందేహంగా ఇప్పటికీ కూడా ప్రపంచంలోనే మేటి బ్యాటర్లలో కోహ్లీ ఒకడు. కానీ అన్ని ఫార్మాట్లలో ఓ యంత్రంలా పరుగులు సాధించిన కోహ్లీ ఇప్పుడు తడబడుతున్నాడు. నిజానికి తనంతట తాను కెప్టెన్సీని వదులుకున్న టీ20 క్రికెట్లో కోహ్లి ప్రదర్శన గొప్పగానే ఉంది. గత 23 టీ20 ఇన్నింగ్స్‌ల్లో అతడి సగటు 59.76. అదే వన్డేల్లో గత 15 మ్యాచ్‌ల్లో సగటు 43.26. ఫర్వాలేదనిపించే సగటే అయినా.. కోహ్లి ప్రమాణాల మేర చూస్తే మాత్రం అది తక్కువన్నట్లే. కానీ కోహ్లీకి అసలు దెబ్బ మాత్రం.. తాను అన్నింటికంటే ఉత్తమ ఫార్మాట్ అని ఎప్పుడూ చెప్పే టెస్టు క్రికెట్లో తగిలింది.
మూడు ఫార్మాట్లలో అవిశ్రాంతంగా ఆడడం, నాయకత్వం వహించడం వల్లనేమో.. ఒత్తిడి అతడి బ్యాటింగ్‌ను, సగటును దెబ్బతీసింది. కెరీర్‌లో ఎప్పుడూలేని హీన దశను ఎదుర్కొంటున్న కోహ్లి.. 2021లో 11 టెస్టుల్లో 28.21 సగటు, నాలుగే అర్దశతకాలతో కేవలం 536 పరుగులు చేశాడు. ఈ గణంకాలు చూస్తే ఒకప్పుడు పరుగుల వరద పారించిన కోహ్లీనేనా అన్న భావన కలుగుతోంది.
అతడి బ్యాటింగ్‌లో పాత కోహ్లీ కన్పించడం లేదు. కోహ్లీ సెంచరీ చేసి ఎంతకాలమైందో! ఎప్పుడో 2019 నవంబరు (బంగ్లాదేశ్‌తో టెస్టులో)లో చివరిసారి మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఆ జోరు కొనసాగించి ఉంటే ఈపాటికి సచిన్ వంద సెంచరీల రికార్డు బద్దలు కొట్టేవాడు. కానీ అప్పటి నుంచి అతడు ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయలేకపోయాడు. దీంతో, ఈ ఏడాదైనా కోహ్లీ తిరిగి లయ అందుకోని చెలరేగాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
4. ఐసీసీ ట్రోఫీ :
టీమిండియా ఐసీసీ ట్రోఫీ సాధించి ఎనిమిది ఏళ్లు దాటిపోయింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన దగ్గర నుంచి.. ఇంతవరుకు టీమిండియా ఖాతాలో ఐసీసీ ట్రోఫీ లేదు. గతేడాది టీ-20 వరల్డ్ కప్ 2021 లో లీగ్ స్టేజీలోనే నిష్క్రమించి.. ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది టీమిండియా.
అయితే, ఆ లెక్కలన్నీ సరిచేసే అవకాశం టీమిండియాకు ఈ ఏడాది కల్పించనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది టీ-20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. కొత్త నాయకుడు రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని టీమిండియా ఈ కప్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ఏడాది టీమిండియాకు కలిసివస్తోందో లేదో మరి వేచి చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.