హోమ్ /వార్తలు /క్రీడలు /

Olympics: అలనాటి ఒలింపిక్ టార్చ్ బేరర్.. ఇప్పుడు రోజువారీ కూలీ

Olympics: అలనాటి ఒలింపిక్ టార్చ్ బేరర్.. ఇప్పుడు రోజువారీ కూలీ

Pinky Karmakar

Pinky Karmakar

అప్పట్లో ఆమెకు స్థానికుల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతో గౌరవం దక్కింది. ప్రతి ఒక్కరి నుంచి గౌరవమర్యాదలు, ప్రేమ దక్కడంతో ఆమెలో ఎన్నో కలలు రేకెత్తాయి. ఆర్చరీ క్రీడాకారిణిగా రాణించాలి ఆమె ఎన్నో కలలు కన్నది.

ఒలింపిక్స్‌ (Olympics) క్రీడా పోటీల్లో పాల్గొనడమనేది మాములు విషయం కాదు. ఇక ప్రతిష్టాత్మక ఒలింపిక్‌ జ్యోతిని పట్టుకొని దేశానికి ప్రాతినిథ్యం వహించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అయితే పింకీ కర్మాకర్ (Pinky Karmakar) అనే యువతి 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి టార్చ్ బేరర్‌గా ప్రాతినిథ్యం వహించింది. అప్పట్లో ఆమెకు స్థానికుల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతో గౌరవం దక్కింది. ప్రతి ఒక్కరి నుంచి గౌరవమర్యాదలు, ప్రేమ దక్కడంతో ఆమెలో ఎన్నో కలలు రేకెత్తాయి. ఆర్చరీ క్రీడాకారిణిగా రాణించాలి ఆమె ఎన్నో కలలు కన్నది. కానీ గడిచిన 9 ఏళ్లలో ఆమె జీవితం తలకిందులైంది. భారతదేశానికి మెడల్స్ తెచ్చి గర్వకారణంగా నిలవాలకున్న ఆమె ఇప్పుడు సాధారణ జీవితాన్ని గడపడానికి కూడా కష్టపడుతోంది. ప్రస్తుతం రోజువారీ కూలీగా టీ తోటలో పనిచేస్తున్న ఆమె దీనావస్థ అందరినీ కలిచివేస్తోంది.

ఇది కూడా చదవండి : డేంజర్ లో విరాట్ కోహ్లీ ర్యాంకు.. టాప్ -10 లోకి బుమ్రా.. రోహిత్ శర్మ దూకుడు..

అస్సాంలోని దిబ్రుగర్ జిల్లాకు చెందిన పింకీ కర్మాకర్ ఆగస్టు 10న, 2012 లండన్ ఒలింపిక్స్‌లో "టార్చ్ బేరర్" రన్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. అప్పట్లో ఒలింపిక్ జ్యోతిని చేతబూనిన ఈ యువతి.. ఇప్పుడు ఆమె దిబ్రుగర్ జిల్లాలోని బోర్బోరోహ్ టీ ఎస్టేట్‌లో రూ.205 రోజువారీ వేతనానికి కార్మికురాలుగా పనిచేస్తోంది. ఇప్పటికీ ఆమె ఒలింపిక్స్‌లో తాను గడిపిన క్షణాలు మర్చిపోలేకపోతోంది. ఒలింపిక్ జ్యోతిని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డానని.. అది చాలా పెద్దగా ఉందని.. ఆమె చెబుతూ ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటోంది.

పింకీ కర్మాకర్ (ఎడమవైపు నుంచి మూడో వ్యక్తి)

లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు దిబ్రుగర్ లో ఘనస్వాగతం లభించింది. రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమె ఇంటిని తండోపతండాలుగా వచ్చి అభినందించారు. కానీ ఇప్పుడు తనకు ఏ వర్గం నుంచి సహాయం అందడం లేదు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేక చదువు అర్ధాంతరంగా ఆపేశానని ఆమె వాపోతోంది.

పింకీ కర్మాకర్..

అప్పట్లో అస్సాం మాజీ సీఎం సోనోవాల్ ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర) పవన్ సింగ్ గఠోవర్ సహాయం అందిస్తానని మాటిచ్చారు. కానీ ఇప్పుడు ఆమె జీవించి ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపడం లేదట. రిటైర్డ్ తండ్రి, సోదరుడు, సోదరి బాగోగులను చూసుకోడానికి తాను రోజువారీ కూలీపని చేస్తున్నట్లు ఆమె చెప్పింది. లవ్లీనా బొర్గొహెన్‌ విజయం పట్ల తాను ఎంతో సంతోషించానని.. తనలాంటి పరిస్థితిలో ఏ క్రీడాకారుడూ ఉండకూడదని ఆమె చెబుతోంది.

పింకీకి ఎదురైన అనుభవంతో అస్సాంలోని టీ కమ్యూనిటీకి సహాయం అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తాము భావిస్తున్నట్లు జిల్లా ఆల్ అస్సాం టీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి చెప్పారు. పింకీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిందని.. త్వరలోనే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కలుస్తామని ఆయన తెలిపారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Assam, Olympics, Sports, VIRAL NEWS

ఉత్తమ కథలు