కశ్మీర్ (Kashmir) అంటే చాలామందికి సైనికులు, ఉగ్ర దాడులు, యుద్ధాలే గుర్తుకొస్తాయి. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు కశ్మీర్లో పరిస్థితులు మారాయి. అక్కడి యువత అసాధారణ ప్రతిభతో ప్రపంచానికి తామేంటో చాటిచెబుతున్నారు. కశ్మీరీ యువత ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుతున్నారు. దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఇక్కడి యువకులు చాలామంది ఉన్నారు. తాజాగా ఫుట్‌బాల్ (Football)లో తనదైన ముద్ర వేస్తూ ఇటీవల ‘గార్డియన్ నెక్స్ట్ జనరేషన్’ (Guardian Next Generation list) లిస్ట్‌లో పేరు దక్కించుకున్నాడు శ్రీనగర్ జిల్లాలోని ఖొమేనీ చౌక్ బేమినా ప్రాంతానికి చెందిన ఒక యువకుడు. అతడి పేరు సొహైల్ అహ్మద్ భట్ (Sohail Bhat). ఎన్నో అటుపోట్ల నడుమ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువకుడి సక్సెస్ స్టోరీ చూద్దాం.
పదిహేడేళ్ల సొహైల్ అహ్మద్ భట్ ప్రస్తుతం అండర్-20 భారత ఫుట్‌బాల్ జట్టులో సభ్యుడు. సొహైల్ పద్నాలుగేళ్ల వయసులో ఫుట్‌బాల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఆడిన తన మొదటి మ్యాచ్‌లోనే గోల్ చేశాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. కష్టపడి జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.
ఈ క్రమంలో ఇటీవల ది గార్డియన్ వార్తాసంస్థ ప్రతిభావంతులైన యువతను గుర్తిస్తూ ‘నెక్స్ట్ జనరేషన్ 2022’ పేరుతో ప్రకటించిన జాబితాలో సొహైల్ చోటు దక్కించుకున్నాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగల ప్రపంచంలోని అరవై మంది ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ ఆటగాళ్ల పేర్లలో ఇతడిని కూడా చేర్చి గౌరవించింది బ్రిటన్ దినపత్రిక ‘ది గార్డియన్’.
* చిన్నప్పటి నుంచే ఫోకస్
గార్డియన్ లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం తనకు దక్కిన గౌరవం అంటున్నాడు సొహైల్. ఫుట్‌బాల్ ప్రపంచంలో తన శక్తి మేరకు మరింత కష్టపడి ఎదుగుతూనే ఉంటానని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టమని, తన ప్రాంతంలోని స్థానిక జట్లతో ఆడేవాడని సొహైల్ తెలిపాడు. ‘2017లో స్టేట్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌లో చేరి ప్రయాణం ప్రారంభించాను. నా గురువు సాజిద్ దార్ దగ్గర శిక్షణ పొందాడు. ఆయన మార్గదర్శకత్వంలో భారత జూనియర్ జట్టుకు ఎంపికయ్యాను.’ అని సొహైల్ వివరించాడు.
* టార్గెట్ నేషనల్ టీమ్
అండర్-16 టీమ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చినందుకు సొహైల్‌ను అండర్-17కు, ఆ తర్వాత అండర్-20 టీమ్‌కు ఎంపిక చేశారు. ఇప్పుడు నేషనల్ టీమ్‌లో చోటు కోసం సిద్ధమవుతున్నాడు. జాతీయ ఫుట్‌బాట్ జట్టులో స్థానం దక్కించుకోవడం తన కల అంటున్నాడు సొహైల్. ‘నా అరంగేట్రం మ్యాచ్‌లో UAEపై గోల్ చేశాను. ఇది నిజంగా హ్యాపీ ఫీలింగ్. నా కుటుంబం, కోచ్ మద్దతుతోనే ఇక్కడి వరకు వచ్చాను. వారి సపోర్ట్‌తోనే ఈ రోజు భారత అండర్-20 జట్టులో భాగమయ్యాను. త్వరలో భారత సీనియర్ జట్టులో భాగం అవుతాననే నమ్మకం ఉంది’ అని సొహైల్ వివరించాడు.
* అక్కడ ఈజీ కాదు
అయితే ఇప్పటి వరకు సొహైల్ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. కశ్మీర్లో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కొరత ఉంటుంది. అందులోనూ మారుమూల ప్రాంతాల నుంచి శ్రీనగర్‌కు రావడం చాలా రిస్క్. ఇలాంటి సవాళ్లు ఎదురైనా సొహైల్ దృష్టిని మాత్రం ఆట నుంచి మరల్చలేదు. చిన్న అవకాశాలను ఒడిసిపట్టుకొని ఇప్పుడు పెద్ద లక్ష్యం దిశగా అతడు ప్రయాణిస్తున్నాడు.
సొహైల్ కోచ్ సాజిద్ దార్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఆడాడు. ఇప్పుడు ఆయన శిక్షణలో సొహైల్ రాటుదేలుతున్నాడు. సొహైల్ మరింత గొప్ప పేరు సాధిస్తాడని నమ్మకంగా చెబుతున్నారు సాజిద్. తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న వారు జాతీయ జట్టులో భాగమవుతున్నందుకు సంతృప్తిగా ఉందన్నారు. సొహైల్ ప్రయాణం ఇతర కశ్మీరీ యువకులకు ఒక మార్గంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కశ్మీర్లో జిల్లా స్థాయిలో క్రీడా మైదానాలు, ముఖ్యంగా ఫుట్‌బాల్ మైదానాలు నిర్మిస్తే దేశం గర్వించేలా ఎందరో యువకులు ఎదగగలరని సాజిద్ చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Football, Jammu kashmir, Kashmir, Sports