French Open 2022 Final : ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ టెన్నిస్ (Tennis) టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ (French Open) 2022 సీజన్ తుది సమరానికి చేరుకుంది. నేడు పురుషుల విభాగంలో జరిగే సింగిల్స్ ఫైనల్ తో రెండు వారాల పాటు అలరించిన ఫ్రెంచ్ ఓపెన్ కు తెరపడనుంది. ఇక నేటి ఫైనల్లో 13 సార్లు చాంపియన్, మట్టి కోర్టు మహారాజు రాఫెల్ నడాల్ (Rafael Nadal) తో నార్వే యువ కెరటం క్యాస్పర్ రూడ్ (Casper Ruud) అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ ఫైనల్లో క్లే కింగ్ నడాల్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాడు. గతంలో 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు చేరుకున్న నడాల్.. అన్నిసార్లూ చాంపియన్ గా నిలిచాడు. ఇక ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రూడ్ అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరుకున్నాడు. ఇక నేటి మ్యాచ్ లో నడాల్ గెలిస్తే అది ఆనవాయితీ అవుతుంది. అదే రూడ్ గెలిస్తే మాత్రం మట్టి కోర్టుపై కొత్త చరిత్రను లిఖించినట్లు అవుతుంది. ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే. భారత కాలమానం ప్రకారం ఈ ఫైనల్ నేటి (ఆదివారం) సాయంత్రం గం. 6.15 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్ 2, సోనీ టెన్ 3 చానెల్స్ తో పాటు సోనీ లైవ్ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇది కూడా చదవండి : 6, 6, 6, 6, 6, 6.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. కొట్టిందెవరో కాదు..
36 ఏళ్ల వయసులోనూ నడాల్ అద్భుతంగా ఆడుతున్నాడు. అచ్చొచ్చిన క్లే కోర్టులో చెలరేగిపోయి ప్రత్యర్థిని ముచ్చెమటలు పెట్టిస్తున్నాడు. టోర్నీలో నడాల్ ఆటను ఒకసారి చూస్తే.. నాలుగో రౌండ్ వరకు ఆడుతూ పాడుతూ వచ్చాడు. అయితే నాలుగో రౌండ్ లో టీనేజర్ ఫెలిక్స్ నుంచి నడాల్ కు తొలిసారి ప్రతిఘటన ఎదురైంది. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చెమటలు కక్కిన నడాల్ చివరకు విజయం సాధించి ఊపిరిపీల్చుకున్నాడు. ఇక క్వార్టర్స్ వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ తో ఆడిన నడాల్.. పెద్దగా ప్రతిఘటన లేకుండానే గెలిచి సెమీస్ చేరుకున్నాడు. ఇక సెమీస్ లో మాత్రం నడాల్ కు అలెగ్జాండర్ జ్వెరెవ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. గాయంతో జ్వెరెవ్ తప్పుకోక ముందు వరకు కూడా ఇరువురు 3 గంటల పాటు ఆడగా.. రెండు సెట్లు కూడా పూర్తి కాలేదు. నడాల్ తొలి సెట్ ను టై బ్రేక్ లో గెలువగా.. రెండో సెట్ కూడా టై బ్రేక్ కు దారి తీసింది. ఈ క్రమంలో జ్వెరెవ్ గాయపడ్డాడు. దాంతో అతడు నడాల్ కు వాకోవర్ ఇచ్చాడు. ఇక రూడ్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇతడు.. వరుసగా విజయాలు సాధిస్తూ ఫైనల్ కు చేరుకున్నాడు. అయితే ఫైనల్ కు చేరే క్రమంలో రూడ్ టాప్ సీడర్లను ఎదుర్కోలేదు. క్వార్టర్స్ లో రూనెపై సెమీస్ లో చిలిచ్ పై నాలుగు సెట్ల పోరులో నెగ్గాడు. అయితే ఫైనల్లో గెలవాలంటే మాత్రం తన శక్తికి మించి పోరాడాల్సి ఉంది.
ముఖాముఖి పోరు
వీరిద్దరూ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనలే వీరిద్దరి మధ్య జరుగుతోన్న తొలి మ్యాచ్. అయితే ఫ్రెంచ్ ఓపెన్ నడాల్ కంచుకోట అని అందరికీ తెలిసిందే. అయితే రూడ్ ను తక్కువ చేసి చూడలేము. నడాల్ గెలిస్తే అతడి ఖాతాలో 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ చేరుతుంది. ఈ క్రమంలో మార్గెరెట్ కోర్ట్ పేరిట ఉన్న ఆల్ టైమ్ గ్రాండ్ స్లామ్స్ రికార్డు (24)ను సమం చేసేందుకు కేవలం రెండు అడుగుల దూరంలో నిలుస్తాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: French open, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Tennis