French Open 2022 : ఫ్రెంచ్ ఓపెన్ (French Open) 2022లో కొద్దిలో పెను సంచలనం తప్పిపోయింది. ఫ్రెంచ్ ఓపెన్ ను 13 సార్లు గెలిచిన స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ (Rafael Nadal) కొద్దిలో ఓటమి నుంచి తప్పించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్ పోరులో నాదల్ గెలుపొందేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. 21 ఏళ్ల ఫెలిక్స్ (కెనడా)తో తలపడిన ఎర్రమట్టి రారాజు నాదల్.. విజయం కోసం ఐదు సెట్ల పాటు ఆడాల్సి వచ్చింది. నాదల్ పై విజయం కోసం ఐదు సెట్ల పాటు వీరోచితంగా పోరాడిన ఫెలిక్స్ చివరకు ఓడి ఇంటి దారి పట్టక తప్పలేదు. ఈ మ్యాచ్ లో నాదల్ 3-6, 6-3, 6-2, 3-6, 6-3తో ఫెలిక్స్ పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించిన నాదల్ చివరకు విజయం సాధించి ఊపిరి పీల్చుకున్నాడు.
ఆట ఆరంభం నుంచే ఫెలిక్స్ దూకుడు కనబరిచాడు. తన బలమైన సర్వీసును నమ్ముకున్న అతడు రిటర్న్ చేయలేని విధంగా సర్వీస్ చేస్తూ నాదల్ కు చెమటలు పట్టించాడు. ఈ క్రమంలో తొలి సెట్ లో కీలకమైన నాదల్ సర్వీస్ ను బ్రేక్ చేసిన అతడు.. ఆ తర్వాత తన సర్వీస్ ను నిలబెట్టుకుని తొలి సెట్ ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ లో ప్రత్యర్థి నుంచి ఎదురైన షాక్ నుంచి నాదల్ తొందరగానే తేరుకున్నాడు. రెండో సెట్ నుంచి క్లే కోర్టుపై తనకే సాధ్యమయ్యే ఆటతీరును కనబరుస్తూ పాయింట్లు సాధించాడు. ఈ క్రమంలో ప్రత్యర్థి సర్వీస్ ను బ్రేక్ చేసిన అతడు రెండో సెట్ ను.. ఆ తర్వాత మూడో సెట్ లో రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్ ను బ్రేక్ చేసి అందులోనూ విజయం సాధించాడు.
NOTHING is a lost cause for Rafael Nadal.
🤯 @rolandgarros #RolandGarros pic.twitter.com/H9fsr1MCxG
— Tennis TV (@TennisTV) May 29, 2022
నాలుగో సెట్ లో ఫెలిక్స్ అద్భుతం
నాలుగో సెట్ ను దక్కించుకుంటే చాలు.. నాదల్ క్వార్టర్ ఫైనల్ బెర్త్ సొంతం అవుతుంది. అయితే ఇక్కడ ఊహించని విధంగా పుంజుకున్న ఫెలిక్స్ మరోసారి నాదల్ కు తన సర్వీస్ తో చుక్కలు చూపించాడు. బలమైన ఫెలిక్స్ సర్వీస్ లను నాదల్ ఒక దశలో బిత్తర చూపులు చూశాడు. అదే సమయంలో అనవసరపు తప్పిదాలు చేస్తూ మూల్యం చెల్లించుకున్నాడు. ఇందులో నాదల్ సర్వీస్ ను బ్రేక్ చేసిన ఫెలిక్స్ సెట్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో మ్యాచ్ ఐదో సెట్ కు వెళ్లింది. నాలుగో సెట్ లో ఫెలిక్స్ ఆటతీరును చూసిన వారికి నాదల్ ఓడిపోతాడా అనే సందేహం కూడా కలిగింది. అయితే ఐదో సెట్ లో సత్తా చాటిన నాదల్.. ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాడు. నెట్ వద్దకు దూసుకొస్తూ అద్భుత షాట్లతో పాయింట్లు సాధించాడు. అలాగే బేస్ లైన్ క్రాస్ కోర్టు షాట్లతో ఫెలిక్స్ ను కోర్టు మొత్తం పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఐదో సెట్ ను సొంతం చేసుకున్న నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఫెలిక్స్ ఓడినా అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: French open, IPL, IPL 2022, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Rohit sharma, Virat kohli