అంతర్జాతీయ వేదికలపై క్రీడలకు సంబంధించి మెగా ఈవెంట్లు జరుగున్న సమయంలో పలు వ్యాపార సంస్థలు స్పాన్సర్లుగా (Sponcer) వ్యవహరిస్తుంటారు. అంతే కాకుండా ఆ సమయంలో మంచి ఆఫర్లు ప్రకటించి క్రీడాభిమానులను ఆకట్టుకొని వ్యాపారం పెంచుకోవాలని ఎత్తులు వేస్తుంటారు. ఐపీఎల్, వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్లు జరిగే సమయంలో ఇండియాలో కూడా పలు సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ముఖ్యంగా ఫుడ్, బేవరేజెస్‌కు సంబంధించిన ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాగే ఒకసారి ప్రముఖ అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనల్డ్స్ (McDonalds) భారీ ఆఫర్ (Free Offer) ప్రకటించింది. ఫుట్ ఉచితం అంటూ ప్రచారం చేసుకున్నది. ఈ దెబ్బతో మెడ్‌డొనాల్డ్స్ సేల్స్ పెరిగి లాభాల పంట పండుతుందని భావించింది. అయితే ముందుగా ఊహించని పరిణామంతో భారీగా నష్టపోయింది. ఇదంటే 1984 ఒలింపిక్స్ (Olympics) సందర్భంగా జరిగిన ముచ్చట. అసలు జరిగింది ఏంటంటే... 1984 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్‌లో జరిగాయి. ఆ ఒలింపిక్స్ స్పాన్సర్లలో ఒకరిగా ప్రముఖ సంస్థ మెక్‌డొనాల్డ్స్ వ్యవహరించింది. ఒలింపిక్స్ సందర్భంగా 'వెన్ యూఎస్ విన్.. యూ విన్' (అమెరికా గెలిస్తే మీరూ గెలుస్తారు) అనే స్లోగన్‌తో భారీ ఆఫర్ ప్రకటించింది.
ఈ ఆఫర్లో భాగంగా కొన్ని వేల ఉచిత స్క్రాచ్ కార్డులను ప్రజలకు పంచేసింది. ఆ స్క్రాచ్ కార్డులో ఏదో ఒక క్రీడా విభాగం ఉంటుంది. దాన్ని గీకితే ఆ ఆట ఏమిటో కనపడుతుంది. ఆ ఆటలో కనుక అమెరికా పతకం గెలిస్తే మెక్‌డొనాల్డ్స్‌లో బర్గర్, కోక్, ఫ్రైస్ ఉచితంగా అందించేస్తారు. అమెరికా మహా అంటే 40 లోపు స్వర్ణాలు గెలుస్తుంది అని మెక్‌డొనాల్డ్స్ అంచనా వేసుకుంది. ఎందుకంటే అంతకు ముందు జరిగిన ఒలింపిక్స్‌లో అమెరికా 34 స్వర్ణాలు మాత్రమే గెలిచింది. అప్పట్లో రష్యా, ఈస్ట్ జర్మనీ దేశాలకే ఎక్కువ స్వర్ణాలు వచ్చేవి. ఈ సారి కూడా అలాగే వస్తాయని ఊహించింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది.
ఆ ఒలింపిక్స్ జరిగే సమయంలో అమెరికా-రష్యాల మధ్య ప్రచ్చన్న యుద్దం జరుగుతోంది. దీంతో 1980 రష్యాలో జరిగిన ఒలింపిక్స్‌కు అమెరికా డుమ్మా కొట్టింది. దీనికి ప్రతీకారంగా 1984 ఒలింపిక్స్‌కు మేము రావడం లేదని రష్యా, దాని మిత్రదేశం ఈస్ట్ జర్మనీ ప్రకటించేశాయి. మెక్‌డొనాల్డ్స్ అప్పటికే ఉచిత ఆఫర్ ప్రకటించేసింది. రష్యా, ఈస్ట్ జర్మనీలు రాకపోవడంతో ఆ ఒలింపిక్స్‌లో అమెరికా ఏకంగా 83 స్వర్ణ పతకాలు సాధించింది. ప్రతీ విభాగంలో మెడల్సే మెడల్స్. దీంతో అమెరికా ప్రజలు స్క్రాచ్ కార్డులు పట్టుకొని మెడ్‌డొనాల్డ్స్ అవుట్ లెట్ల ముందు క్యూలు కట్టారు. అంచనా వేసుకున్న దాని కంటే రెండు రెట్లు ఎక్కువ ఫ్రీ ఫుడ్ ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో భారీగా నష్టపోయింది. కానీ మెక్‌డొనాల్డ్స్ ఏనాడూ ఎంత నష్టం వచ్చిందని మాత్రం ప్రకటించలేదు. మూడున్నర దశబ్దాల క్రితమే ఈ ఉచిత ఆఫర్ కారణంగా కొన్ని మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మెక్‌డొనాల్డ్స్ ఎప్పుడూ ఇలాంటి ఉచిత ఆఫర్ల జోలికి పోలేదు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.