FORMER TEAM INDIA OPENER VIRENDER SEHWAG SAYS YO YO TEST SHOULD NOT BE MAJOR CRITERIA OF SELECTION SRD
Virender Sehwag : అది ఉంటే ఆ రోజుల్లో సచిన్, లక్ష్మణ్, గంగూలీ జట్టుకు ఎంపికయ్యే వాళ్లే కాదు..
వీరేంద్ర సెహ్వాగ్
Virender Sehwag : భారత జట్టులోకి ఎంపిక అవ్వాలంటే ఫిటెనెస్ టెస్ట్ పాసవ్వడం తప్పనిసరి. ఫిటెనెస్ లెవల్స్ ఉంటేనే ఆటగాళ్లు సత్తా చాటుతారన్న అభిప్రాయంతో ఈ రూల్ పెట్టింది బీసీసీఐ (BCCI). అయితే, ఈ రూల్ పై మాజీ క్రికెటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) గ్రౌండ్ లోనే కాదు.. బయట కూడా డాషింగ్ గానే ఉంటాడు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు. క్రికెట్ లో ఎవరైనా సరిగ్గా ఆడకపోతే.. ముఖమ్మీదే చెప్పగలిగే మనస్తత్వం వీరూది. లేటెస్ట్ గా ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ టీమిండియా ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియపై పెదవి విరిచాడు. ప్రస్తుతం, ఏ ఆటగాడైనా జట్టులోకి ఎంపికవ్వాలంటే యో-యో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఈ పరీక్ష ఆటగాడి ఫిట్నెస్కు సంబంధించినది. అయితే ఫిట్నెస్ కంటే టాలెంట్ ముఖ్యమని సెహ్వాగ్ "క్రికెట్బజ్" తో మాట్లాడుతూ అన్నాడు. అలాగే, యో-యో పరీక్ష ఇంతకు ముందే జరిగి ఉంటే.. సచిన్ (Sachin Tendulkar) లక్ష్మణ్ (VVS Laxman), గంగూలీ (Sourav Ganguly) ఎప్పటికీ ఉత్తీర్ణత సాధించలేరు అని సెహ్వాగ్ చెప్పాడు. "యో-యో పరీక్షలో పాస్ అవ్వనందున.. అశ్విన్, చక్రవర్తి అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేకపోవచ్చు. కానీ నేను ఈ వాదనను ఏకీభవించను. ఆటగాళ్లను ఎన్నుకోవటానికి జట్టుకు ఇలాంటి ప్రమాణాలు ఉంటే.. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ఎప్పటికీ ఉత్తీర్ణత సాధించలేరు. ఈ ముగ్గురు సీనియర్స్..బీఫ్- (మల్టీస్టేజ్ ఫిట్నెస్ టెస్ట్) పరీక్షల్లో పాస్ అవ్వడం నేను చూడలేదు. బీప్ పరీక్షకు 12.5 పాయింట్లు అవసరం. కానీ సచిన్, గంగూలీ, లక్ష్మణ్ 10 లేదా 11 పాయింట్లు సాధించేవారు. అయితే, ఈ ఆటగాళ్ల స్కిల్స్ మాత్రం అద్భుతం " అని సెహ్వాగ్ చెప్పాడు.
"ఫిట్నెస్ కంటే నైపుణ్యం ముఖ్యమని నా అభిప్రాయం. మీ జట్టులో ఆటగాళ్లు ఫిట్నెస్తో ఉండి.. మీరు ప్రతి మ్యాచ్లో ఓడిపోతుంటే ఏం చేస్తారు. ఆటగాళ్లకు నైపుణ్యం లేకపోతే.. ఫిట్నెస్తో ఉన్నా వేస్ట్. నైపుణ్యంతో బ్యాటింగ్, బౌలింగ్ చేసే వారు జట్టుకు ఆడాలి. ఎందుకంటే అలాంటి ఆటగాళ్ళు కష్ట సమయాల్లో మంచి ప్రదర్శన ఇవ్వగలరు. అదే సమయంలో, జట్టులో ఉంటే ఆటగాడి ఫిట్నెస్ క్రమంగా మెరుగుపడుతుంది" అని సెహ్వాగ్ అన్నాడు.
ఈ విషయంపై సెహ్వాగ్ కు మాజీ క్రికెటర్లు మద్దతు ఇస్తున్నారు. ఫిటెనెస్ కంటే టాలెంటే ముఖ్యమని చెబుతున్నారు. ఇక, సెహ్వాగ్ తాజాగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో ఆడాడు. ఈ సిరీస్ లో పాత సెహ్వాగ్ లా అద్బత హిట్టింగ్ తో ఆకట్టుకున్నాడు. సచిన్, సెహ్వాగ్, యువరాజ్ క్లాస్ తో ఆ సిరీస్ లో ఇండియా లెజెండ్స్ విజేతగా నిలిచింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.