క్రికెట్ లో సచిన్ (Sachin Tendulkar) కన్నా ముందు ఈ గేమ్ కు వన్నె తెచ్చిన ఆటగాళ్లలో సునీల్ గవాస్కర్ (Sunil Manohar Gavaskar) ఒకరు. సన్నీ అని ముద్దుగా ఫ్యాన్స్ పిలుచుకునే ముంబైకి చెందిన ఈ బ్యాటర్ 1970', 1980' దశాబ్దాలలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్ గా తన అపూర్వ సేవలందించాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తొలిసారిగా విండీస్ పర్యటనలో మేటి బౌలర్లను ఎదుర్కొని ఒకే సీరీస్ లో 774 పరుగులు చేయడం ఇప్పటికీ ఓ రికార్డే. అప్పట్లో 125 టెస్టు మ్యాచ్ లు ఆడి మొత్తం 10122 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. భారత జట్టుకు ఓపెనర్ గా దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగి ఎన్నో మరవలేని విజయాలను అందించారు. అయితే.. ఆయన శ్వాస, ధ్యాయ అంతా క్రికెటే. అందుకే క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఎంతో ప్రయత్నించారు. కానీ.. చివరకు చేతులెత్తేశారు.
మూడు దశాబ్దాల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్లాట్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ తిరిగి ఇచ్చేశారు. క్రికెట్ అకాడమీ నెలకొల్పేందుకు మహారాష్ట్ర హౌజింగ్ ఏజెన్సీ(ఎంహెచ్ఏడీఏ) ముంబైలోని బాంద్రాలో 33 ఏళ్ల క్రితం ఈ స్థలాన్ని కేటాయించింది. అప్పటి నుంచి ఇది నిరుపయోగంగానే ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హౌజింగ్ మినిస్టర్ జితేంద్ర అవ్హాద్.. గతేడాది సునీల్ గావస్కర్‌కు లేఖ రాశారు. బాంద్రాలో కేటాయించిన ప్లాట్ నిరుపయోగంగా పడి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్లాట్‌ను తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, క్రికెట్ అకాడమీ నెలకొల్పాలని సునీల్ గావస్కర్ ఇదివరకే పలు ప్రయత్నాలు చేశారు. సచిన్ టెండూల్కర్ తో కలిసి అకాడమీ అభివృద్ధి కోసం ఓ ప్లాన్‌ను రూపొందించారు. ఈ మేరకు ఠాక్రే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. దురదృష్టవశాత్తు అవేవీ ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే గవాస్కర్‌కు మంత్రి జితేంద్ర లేఖ రాశారు.
ఇది కూడా చదవండి : సిక్స్ కొట్టి.. విల్లు ఎక్కి పెట్టి.. నా ఆట చూడు అంటున్న మంత్రి రోజా..
ఎనిమిది నెలల చర్చల తర్వాత ప్లాట్‌ను తిరిగి ఇచ్చేస్తున్నట్లు బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. తాను క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయలేనని లేఖలో స్పష్టం చేశారు. అయితే, దీనిపై క్రికెట్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సన్నీ లాంటి దిగ్గజ క్రికెటర్ ఇంకొంచెం ప్రయత్నించి ఉంటే క్రికెట్ అకాడమీ సాకారం అయ్యేదని.. ఎంతో మంది యువ క్రికెటర్లకు అది వరంగా మారి ఉండేదని కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Maharastra Govt, Mumbai, Sachin Tendulkar, Sunil Gavaskar, Team India