FIFA World Cup 2022 : ఖతర్ (Qatar) వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup) 2022లో నేడు ఆసక్తికర మ్యాచ్ లు జరగనున్నాయి. గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’లో మొత్తం నాలుగు మ్యాచ్ లు మంగళవారం జరగనున్నాయి. లీగ్ దశలో మంగళవారం నుంచి ఆఖరి రౌండ్ మ్యాచ్ లు ఆరంభం కానున్నాయి. దాాంతో ప్రతి జట్టుకు కూడా నేటి మ్యాచ్ లు కీలకంగా మారాయి. 32 జట్ల నుంచి కేవలం 3 జట్లు (పోర్చుగల్, బ్రెజిల్, ఫ్రాన్స్) మాత్రమే రౌండ్ ఆఫ్ 16 దశకు చేరుకున్నాయి. మిగిలిన జట్లలో ఖతర్ మాత్రమే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో 13 స్థానాల కోసం ఏకంగా 28 జట్లు పోటీ పడనుండటంతో ఆఖరి రౌండ్ మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగనున్నాయి.
గ్రూప్ ‘ఎ’లో ఈక్వెడార్, సెనెగల్, ఖతర్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ఈ నాలుగు జట్లు కూడా ఇప్పటికే రెండేసి మ్యాచ్ లు ఆడాయి. ఒక విజయం.. ఒక డ్రాతో నాలుగేసి పాయింట్లతో నెదర్లాండ్స్, ఈక్వెడార్ లు పాయింట్ల పట్టికలో వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి గం. 8.30 లకు ఖతర్ తో నెదర్లాండ్స్.. సెనెగల్ తో ఈక్వెడార్ లు తలపడనున్నాయి. తమ మ్యాచ్ ల్లో డ్రా చేసుకుంటే చాలు నెదర్లాండ్స్, ఈక్వెడార్ లు ప్రిక్వార్టర్స్ (రౌండ్ ఆఫ్ 16కు) చేరుకుంటాయి. సెనెగల్ ప్రిక్వార్ట్స్ కు చేరాలంటే ఈక్వెడార్ పై తప్పకుండా నెగ్గాలి. ఈ రెండు మ్యాచ్ ల్లో ఈక్వెడార్, నెదర్లాండ్స్ జట్లు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనున్నాయి. ఇకపై ప్రతి గ్రూప్ కూడా ఒకే సమయంలో మ్యాచ్ లను ఆడనున్నాయి. దీనివల్ల ఏ జట్టుకు కూడా అడ్వాంటేజ్ ఉండదు. ఒకే గ్రూప్ లో రెండు వేర్వేరు సమయాల్లో మ్యాచ్ లు జరిగినట్లయితే.. తమ గ్రూప్ లోని ఇతర మ్యాచ్ ఫలితాన్ని బట్టి మిగిలిన రెండు జట్లు తమ ఆటను ఆడే అవకాశం ఉంది. ఇటువంటి అడ్వాంటేజ్ ఉండకుండా ఉండేందుకు ఒకే సమయంలో సేమ్ గ్రూప్ లోని జట్లు మ్యాచ్ లు ఆడనున్నాయి.
ఇది కూడా చదవండి : ‘వజ్రాల వేటలో పడి బంగారం పోగొట్టుకున్నారట’ టీమిండియాకు చురకలంటించిన కైఫ్
ఇక గ్రూప్ ‘బి’ విషయానికి వస్తే ఇంగ్లండ్, వేల్స్, ఇరాన్, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్ మ్యాచ్ లు కూడా రసవత్తరంగా ఉండనున్నాయి. ఇంగ్లండ్ 4 పాయింట్లతో టాప్ లో ఉండగా.. 3 పాయింట్లతో ఇరాన్.. 2 పాయింట్లతో యూఎస్ఏ, ఒక పాయింట్ తో వేల్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. వేల్స్ పై జరిగే మ్యాచ్ ను డ్రా లేదా గెలిచినా ఇంగ్లండ్ నాకౌట్ దశకు చేరుకుంటుంది. ఇక అదే సమయంలో యూఎస్ఏపై జరిగే మ్యాచ్ ను డ్రా చేసుకుంటే ఇరాన్ కూడ తర్వాతి రౌండ్ కు అర్హత సాధస్తుంది. అమెరికా ప్రిక్వార్ట్స్ కు చేరాలంటే ఇరాన్ పై తప్పక నెగ్గాలి. ఇక వేల్స్ ప్రిక్వార్ట్స్ కు చేరాలంటే చాలా కష్టంగా మారింది. ఆ జట్టు ఇంగ్లండ్ పై భారీ గోల్స్ తేడాతో అంటే 4-0తో నెగ్గాల్సి ఉంది.
ఫిఫా ప్రపంచకప్ లో నేడు
నెదర్లాండ్స్ X ఖతర్ (రా.గం. 8.30లకు)
సెనెగల్ X ఈక్వెడార్ (రా.గం. 8.30లకు)
ఇంగ్లండ్ X వేల్స్ (అర్ధరాత్రి గం. 12.30లకు)
యూఎస్ఏ X ఇరాన్ (అర్ధరాత్రి గం. 12.30లకు)
ఈ మ్యాచ్ లను స్పోర్ట్స్ 18, జియో సినిమాలు ప్రత్యక్షప్రసారం చేయనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: England, FIFA, FIFA World Cup 2022, Netherlands, Qatar, USA