FIFA World Cup 2022 : ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup) 2022లో మంగళవారం రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. చివరి ప్రపంచకప్ ఆడుతున్న ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) టీం పోర్చుగల్ (Portugal) నేడు బరిలోకి దిగనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి గం. 12.30లకు జరిగే ఈ మ్యాచ్ లో స్విట్జర్లాండ్ తో పోర్చుగల్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో పోర్చుగల్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. అయితే నాకౌట్ పోరుల్లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఫేవరెట్లుగా బరిలోకి దిగిన జట్లే కొన్ని సార్లు ఓడిపోతుంటాయి. మంగళవారం జరిగే మరో ప్రిక్వార్టర్స్ పోరులో 2010 చాంపియన్ స్పెయిన్ తో మొరాకో జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8. 30లకు ఆరంభం కానుంది.
అందరి కళ్లూ అతడిపైనే
ఫుట్ బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలకు ఇదే చివరి ప్రపంచకప్ కానుంది. అర్జెంటీనా తరఫున మెస్సీ ఈ ప్రపంచకప్ లో అదరగొడుతున్నాడు. ఇక అదే సమయంలో పోర్చుగల్ తరఫున క్రిస్టియానో రొనాల్డో అదరగొట్టాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే గ్రూప్ స్టేజ్ లో రొనాల్డో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. అయితే రొనాల్డోను బిగ్ మ్యాచ్ ప్లేయర్ గా పేర్కొంటాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ ల్లో రెచ్చిపోయి ఆడటం రొనాల్డోకే చెల్లింది. అయితే ప్రస్తుతం రొనాల్డో వయసు 37 ఏళ్లు. ఈ క్రమంలో అతడు స్విట్జర్లాండ్ పై ఎలా ఆడాతాడనేది ఆసక్తికరంగా మారింది. రొనాల్డోతో పాటు బ్రూనో ఫెర్నాండెజ్, ఫెలిక్స్, పెపె, సిల్వా, డియాగో కోస్టా లాంటి ప్రతిభ ఉన్న ప్లేయర్లు పోర్చుగల్ లో ఉన్నారు. ఏ రకంగా చూసినా స్విట్జర్లాండ్ కంటే కూడా పోర్చుగల్ మెరుగైన టీం. ఇక స్పెయిన్, మొరాకో మ్యాచ్ విషయానికి వస్తే.. ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ముఖ్యంగా స్పెయిన్ యువ ప్లేయర్లతో దూకుడు మీద ఉంది. అదే సమయంలో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మొరాకో సంచలన ప్రదర్శనలు చేస్తూ ప్రిక్వార్ట్స్ కు చేరుకుంది.
సోమవారం జరిగిన ప్రిక్వార్ట్స్ పోరుల్లో జపాన్ పై క్రొయేషియా.. దక్షిణ కొరియాపై బ్రెజిల్ విజయాలు సాధించాయి. దాంతో క్రొయేషియా, బ్రెజిల్ లు క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాయి. సోమవారం జరిగిన తొలి ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా పెనాల్టీ షూటౌట్ లో జపాన్ పై నెగ్గింది. షూటౌట్ లో క్రొయేషియా 3-1 తేడాతో జపాన్ పై నెగ్గింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బ్రెజిల్ అదరగొట్టింది. ఏకంగా 4-1 గోల్స్ తేడాతో సౌత్ కొరియాపై గ్రాండ్ విక్టరీని సాధించింది. బ్రెజిల్ తరఫున జూనియర్ (7వ నిమిషంలో), నేమార్ (13వ నిమిషంలో), రిచార్లిసన్ (29వ నిమిషంలో), లుకాస్ (36వ నిమిషంలో) తలా ఒక గోల్ సాధించారు. దక్షిణ కొరియా తరఫున పైక్ (76వ నిమిషంలో) ఒక గోల్ వేశాడు. డిసెంబర్ 9న జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియాతో బ్రెజిల్ ఆడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cristiano Ronaldo, FIFA, FIFA World Cup 2022, Lionel Messi