FIFA World Cup 2022 : నవంబర్ 22వ తేదీన ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup 2022) 2022లో పెను సంచలనం నమోదైన సంగతి తెలిసిందే. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా (Argentina) జట్టుకు పసికూన సౌదీ అరేబియా (Saudi Arabia) భారీ షాక్ ఇచ్చింది. ఆ మ్యాచ్ లో ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా ఆడిన సౌదీ జట్టు అర్జెంటీనాను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. అర్జెంటీనాపై గెలుపుతో సౌదీ ఫుట్ బాల్ జట్టులోని ప్లేయర్లు రాత్రికి రాత్రి హీరోలు అయ్యారు. ఇక సౌదీ అరేబియాలో అయితే ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలో మరుసటి రోజును ఆ దేశ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ సెలవు దినంగా ప్రకటించి సంబరాలు చేసుకోవాలంటూ పిలుపు ఇచ్చారు. అంతేకాకుండా తమ ప్లేయర్లకు భారీ మొత్తంలో నజరానాలు ఇస్తానని కూడా ప్రకటించారు.
ఇది కూడా చదవండి : రైనా 13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన వాషింగ్టన్ సుందర్.. ఎందులో అంటే?
తాజాగా తన మాటను సౌదీ రాజు సల్మాన్ నిలబెట్టుకున్నారు. ఫుట్ బాల్ ప్రపంచకప్ ఆడుతున్న తమ ప్లేయర్లందరికీ బంపరాఫర్ ప్రకటించాడు. ప్రతి ప్లేయర్ కు కూడా రూ. 4 కోట్లకు పైగా విలువ చేసే రోల్స్ రాయల్స్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తాజాాగా రోల్స్ రాయల్స్ సంస్థ ప్లేయర్లందరి కోసం కార్లను తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే వారికి డెలివరీ చేస్తామని కూడా ప్రకటించింది. తమ దేశ ఫుట్ బాల్ జట్టు ప్లేయర్లకు గిఫ్ట్ లను అందించడం సౌదీ అరేబియా రాజులకు ఇదేమి కొత్త కాదు. 1994లో జరిగిన ప్రపంచకప్ లో సౌదీ అరేబియా 1-0 గోల్స్ తేడాతో బెల్జియను ఓడించింది. దాంతో ఆ మ్యాచ్ లో గోల్ చేసిన సయ్యద్ కు అప్పట్లోనే లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు.
ఇక ఈ మ్యాచ్ లో సౌదీ అరేబియా ఒక దశలో 0-1 గోల్స్ తేడాతో వెనుబడి ఉంది. అయితే రెండో అర్ధ భాగంలో అనూహ్యంగా పుంజుకుని రెండు గోల్స్ చేసింది. 5 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి ఆధిక్యంలోకి వచ్చింది. అర్జెంటీనా డిఫెండర్లను చాకచక్యంగా తప్పించిన సౌదీ ఫార్వర్డ్ అల్ షెహ్రి 48వ నిమిషంలో గోల్ చేసి స్కోర్ ను సమం చేశాడు. ఇక 53వ నిమిషంలో అల్ దవ్సరి కళ్లు చెదిరే గోల్ చేసి సౌదీకి 2-1 ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఇక చివర్లో అర్జెంటీనా గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా సౌదీ గోల్ కీపర్ వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాడు. దాంతో గెలవాల్సిన మ్యాచ్ లో మెస్సీ టీం ఓడిపోవాల్సి వచ్చింది. సౌదీ అరేబియా నవంబర్ 26న తన రెండో లీగ్ మ్యాచ్ ను ఆడనుంది. ఈ మ్యాచ్ లో మరో బలమైన జట్టు పొలాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే సౌదీ అరేబియా ప్రిక్వార్టర్స్ కు చేరుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA, FIFA World Cup 2022, Lionel Messi, Qatar, Saudi Arabia