FIFA World Cup 2022 : అర్జెంటీనా (Argentina)పై సంచలన విజయంతో అందరి చూపున తనపై పడేలా చేసుకుంది సౌదీ అరేబియా (Saudi Arabia). ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సౌదీ అరేబియా జట్టు తన ఆరంభ పోరులో టైటిల్ ఫేవరెట్ అర్జెంటీనాకే షాక్ ఇచ్చింది. అయితే ఇదే ప్రదర్శనను తన తర్వాతి మ్యాచ్ లోనూ రిపీట్ చేయలేకపోయింది. గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన పోరులో సౌదీ అరేబియా 0-2 గోల్స్ తేడాతో పొలాండ్ చేతిలో చిత్తయ్యింది. మ్యాచ్ లో ఇరు జట్లు కూడా హోరాహోరీగా తలపడ్డాయి. బాల్ పై ఎక్కువగా నియంత్రణను సౌదీ అరేబియానే ఉంచుకుంది. పొలాండ్ గోల్ పోస్ట్ పై ఏకంగా 16 సార్లు దాడి చేసింది. అదే పొలాండ్ కేవలం 9 సార్లు మాత్రమే దాడి చేసింది. అయితే పొలాండ్ గోల్ కీపర్ స్జెస్నీస్ సౌదీ అరేబియాకు అడ్డుగోడగా నిలిచాడు. సౌదీ ప్లేయర్ల గోల్ ప్రయత్నాలను అద్భుతంగా అడ్డుకున్నాడు.
ఆట ఆరంభం నుంచే ఇరు జట్లు కూడాా గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. ఆట 39వ నిమిషంలో పొలాండ్ ప్రయత్నాలు ఫలించాయి. కెప్టెన్ లెవెండోస్కీ ఇచ్చిన పాస్ ను ఎటువంటి తప్పు చేయకుండా గోల్ పోస్ట్ లోకి నెట్టిన జీలిన్ స్కీ పొలాండ్ కు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. అయితే కాసేపటికే సౌదీ అరేబియాకు పెనాల్టీ లభించింది. ఈ పెనాల్టీని పొలాండ్ గోల్ కీపర్ స్జెస్నీస్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. దీనితో పాటు రెండో అర్ధ భాగంలోనూ సౌదీ అరేబియా గోల్స్ కోసం చేసిన పలు ప్రయత్నాలను పొలాండ్ గోల్ కీపర్ అడ్డుకున్నాడు. ఇక ఆట 82వ నిమిషంలో సౌదీ అరేబియా డిఫెండర్ చేసిన తప్పును సద్వినియోగం చేసుకున్న లెవొండోస్కీ గోల్ చేసి పొలాండ్ గెలుపును ఖాయం చేశాడు. తాజా గెలుపుతో గ్రూప్ ‘సి’లో పొలాండ్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 3 పాయింట్లతో సౌదీ అరేబియా రెండు.. ఒక పాయింట్ తో మెక్సికో మూడు.. 0 పాయింట్లతో అర్జెంటీనా నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
It's a win for Poland! ????????@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) November 26, 2022
అర్జెంటీనాకు చావోరేవో
ఇక ఈరోజు మరో మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు ఆరంభమయ్యే గ్రూప్ ‘సి’ మ్యాచ్ లో పొలాండ్ తో సౌదీ అరేబియా.. రాత్రి గం. 9.30లకు జరిగే గ్రూప్ ‘డి’ మ్యాచ్ లో డెన్మార్క్ తో ఫ్రాన్స్.. అర్ధ రాత్రి గం. 12.30లకు జరిగే మ్యాచ్ లో అర్జెంటీనాతో మెక్సికో జట్లు తలపడనున్నాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA, FIFA World Cup 2022, Football, Poland, Qatar, Saudi Arabia