FIFA World Cup 2022 : ఖతర్ (Qatar) వేదికగా జరుగుతున్నఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup 2022) 2022లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. అనామక జట్ల చేతిలో టాప్ ర్యాంక్ జట్లు పరాజయం పాలవుతున్నాయి. మొన్న సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఖంగుతింటే.. ఆ తర్వాత జర్మనీ జట్టుకు జపాన్ షాక్ ఇచ్చింది. ఇక తాజాగా ప్రపంచ రెండో ర్యాంక్ బెల్జియం (Belgium)ను 22వ ర్యాంక్ జట్టు మొరాకో (Morocco) ఘోరంగా ఓడించింది. గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా జరిగిన పోరులో మొరాకో 2-0 గోల్స్ తేడాతో బెల్జియంపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బెల్జియం తరఫున సబీర్ (73వ నిమిషంలో), అబౌఖలాల్ (90+2వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఈ విజయంతో నాలుగు పాయింట్లు సాధించిన మొరాకో గ్రూప్ ‘ఎఫ్’లో టాప్ ప్లేస్ కు చేరుకుంది.
ఆట ఆరంభం నుంచే మొరాకో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బంతి ఎక్కువ భాగం తమ నియంత్రణలో ఉంచుకోకపోయినా తమకు దొరికిన ప్రతి అవకాశాన్ని గోల్ చేసేలా కనిపించింది. ఈ క్రమంలో తొలి అర్ధ భాగంలో మొరాకో గోల్ చేసింది. అయితే ఆఫ్ సైడ్ కారణంగా రిఫరీ ఆ గోల్ ను రద్దు చేశాడు. దాంతో తొలి అర్ధ భాగం గోల్ లేకుండానే ముగిసింది. ఇక రెండో అర్ధ భాగంలో మొరాకో మరింత వేగంగా ఆడింది. ఇక బెల్జియం పూర్తిగా డిఫెన్స్ కే ప్రధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో 73వ నిమిషంలో మొరాకోకు ఫ్రీ కిక్ లభించింది. లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి సబీర్ కళ్లు చెదిరే కిక్ తో బెల్జియం గోల్ పోస్ట్ లోకి పంపి మొరాకోకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఇంజూరీ సమయంలో మరో గోల్ చేసిన మొరాకో తిరుగులేని విజయాన్ని అందుకుంది.
అంతకుముందు జరిగిన గ్రూప్ ‘ఇ’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కొస్టారికా జట్టు 1-0 గోల్ తేడాతో తన కంటే బలమైన జపాన్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో జపాన్ ప్రిక్వార్టర్స్ అవకాశాలు క్లిష్టం అయ్యాయి. తర్వాతి దశకు అర్హత సాధించాలంటే జపాన్ తన చివరి లీగ్ మ్యాచ్ లో స్పెయిన్ పై తప్పకుండా నెగ్గాల్సి ఉంది.
A historic victory for the Atlas Lions ????????@EnMaroc | #FIFAWorldCup pic.twitter.com/hqJwAgRRFc
— FIFA World Cup (@FIFAWorldCup) November 27, 2022
జర్మనీకి డూఆర్ డై మ్యాచ్
గ్రూప్ ‘ఈ’లో ఉన్న జర్మనీ డూఆర్ డై మ్యాచ్ కు సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ లో స్పెయిన్ తో తలపడనుంది. జపాన్ చేతిలో ఊహించని రీతిలో ఓడిన జర్మనీ.. ప్రిక్వార్టర్స్ కు చేరాలంటే స్పెయిన్ పై తప్పుకుండా నెగ్గాల్సి ఉంది. గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా జరిగే మరో మ్యాచ్ లో కెనడాతో క్రొయేషియా (భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 9.30 నుంచి) తలపడనుంది. ఈ మ్యాచ్ లను స్పోర్ట్స్ 18 చానెల్ తో పాటు జియో సినిమాలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA, FIFA World Cup 2022, Football, Qatar